
ఈనెల 5-6 తేదీల్లో దుబాయి వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. దీనితి భారతీయ సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ అందరూ హాజరు కాబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకకు ఆహ్వానం వచ్చినా సరే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్ వెళ్లలేకపోతున్నాడు. ఇతడు దుబాయి వెళ్లేందుకు ఎర్నాకులం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరిగింది?
మలయాళ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. రీసెంట్‌గానే 'కూలీ'తో దక్షిణాదిలోని మిగతా భాషా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు. గతేడాది ఇతడు లీడ్ రోల్ చేస్తూ 'మంజుమ్మల్ బాయ్స్' అనే చిత్రాన్ని నిర్మించాడు. మూవీ హిట్ అయినప్పటికీ పెట్టుబడిదారుడిని మోసం చేయడంతో ఇతడిపై చీటింగ్ కేసు నమోదైంది. జూలై నెలలో అరెస్ట్ కూడా అయ్యాడు. వెంటనే బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఇంకా ఇబ్బందులు తప్పట్లేదు.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
'మంజుమ్మల్ బాయ్స్' సినిమాకు సౌబిన్‌తో పాటు అతడి తండ్రి, మరొకరు నిర్మాతగా వ్యవహరించారు. అలానే సిరాజ్ అనే ఇన్వెస్టర్ కొంత పెట్టుబడి పెట్టారు. వచ్చిన లాభాల్లో 40 శాతం వాటా ఇస్తానని ముందే మాట్లాడుకున్నారట. ఈ లెక్క ప్రకారం రూ.40 కోట్ల వరకు ఇవ్వాలని, కానీ తనకు రూ.5.99 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్.. కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సౌబిన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వెంటనే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు దుబాయి వెళ్లేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎర్నాకులం కోర్ట్ సౌబిన్‌కి అనుమతి నిరాకరించింది. దీంతో అతడు సైమా అవార్డ్స్ కోసం దుబాయి వెళ్లలేకపోతున్నాడు.
(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)