
పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడతో సుమారు రూ.60 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. దీంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కనీసం తమకు జీఎస్టీ అయినా చెల్లించాలని నిర్మాతను బయ్యర్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. తాను కూడా నష్టపోయానని సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. సుమారు రూ. 18 కోట్ల జీఎస్టీలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశాన్ని సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జీఎస్‌టీ బిల్లు లేకుండానే అనుమతి
హరి హర వీరమల్లు టికెట్ల రేట్లు పెంపు, జీఎస్టీ అంశం గురించి పేర్ని నాని ఇలా అన్నారు. ' ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీఓ ప్రస్తుత ప్రభుత్వం కొట్టివేయలేదు. కానీ, దానిని పాటించకుండా వారికి ఇష్టం వచ్చనట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఒక్క జీఎస్టీ ప్రూఫ్ కూడా ఇవ్వకుండా కేవలం తెల్లకాగితంతో నిర్మాత వెళ్లితే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందరికీ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇది తప్పనిపించలేదా.? అందరిని ప్రశ్నిస్తానని చెప్తాడు.. కానీ, ఆయన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేడు. సూక్తులు మాత్రమే చెప్తాడు.. వాటిని ఆయన ఎంత మాత్రం పాటించడు.' అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ ఎందుకు రద్దు చేయలేదు?
సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఓ గురించి నాని ఇలా అన్నారు. 'హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవాలని మేము జీఓలో చెప్పాం. అందుకు సంబంధించిన జీఎస్టీ ప్రూఫ్స్ కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టికెట్ ధరల పెంపునకు అనుమతి తీసుకోవాలని గతంలో మేము జీఓ జారీ చేశాం. బ్లాక్ టికెట్ల అమ్మకాలు నిలువరించేందుకు అడ్డుకట్ట వేశాం.
దీంతో పవన్ కల్యాణ్ ఊగిపోయారు. సినిమాల కోసం తాము పెట్టుబడిపెట్టుకుని నిర్మించుకుంటే ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ ఆయన రెచ్చిపోయారు. తాము తెచ్చిన ప్రభుత్వ జీఓపై నోటికొచ్చింది మాట్లాడుతూ ఊగిపోయారు. కానీ, ఇప్పటికీ అదే జీఓను ఏపీ సినిమా పరిశ్రమలో ఎందుకు కొనసాగుతుంది..?' అని నాని ప్రశ్నించారు.