లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. అయితే, సినిమా పేరుతో పాటు నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు.


