నా కూతురికి ఐదు పైసలు కూడా ఇవ్వను: ప్రముఖ నటి | Shweta Menon About Her Daughter and Parenting | Sakshi
Sakshi News home page

నా కూతురి కోసం బతకట్లేదు.. తనకోసం పైసా వెనకేయను!

Nov 16 2025 4:09 PM | Updated on Nov 16 2025 4:18 PM

Shweta Menon About Her Daughter and Parenting

ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్‌ (Shweta Menon) ఇటీవలే అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈ పీఠాన్ని దక్కించుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచింది. 13 ఏళ్లకే సినిమాల్లో అడుగుపెట్టిన శ్వేత.. మోడల్‌గా, నటిగా రాణించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

అవార్డులు సూట్‌కేస్‌లో..
ఓ ఇంటర్వ్యూలో శ్వేతా మీనన్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేర్వేరుగానే చూస్తాను. రెండింటినీ మిక్స్‌ చేయను. ఇంటికొచ్చాక పని గురించి ఆలోచించను. అలాగే నాకు వచ్చిన అవార్డులను ప్రదర్శనకు పెట్టకుండా సూట్‌కేస్‌లో భద్రంగా ఉంచుతాను. నా భర్త, కూతురు అడిగినప్పుడు మాత్రమే వాటిని తీసి బయటపెడుతుంటాను. ఇంట్లో ఒక నటిగా కాకుండా, భార్యగా, తల్లిగా, కూతురిగా మాత్రమే ఉండాలనుకుంటాను.

నాన్న కొట్టేవాడు
నాన్న చనిపోయినరోజు నన్ను నేను కోల్పోయినట్లు అనిపించింది. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా తను మాతోనే ఉన్నట్లు భావిస్తాను. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది నాన్న ఒక్కరే! నాన్న చాలా స్ట్రిక్ట్‌.. నన్ను కొట్టేవాడు కూడా.. చిన్నప్పుడు ఆయనంటే ద్వేషం ఉండేది. తన మాట వినాలనిపించేది కాదు. కానీ, నాకు తెలియకుండానే నన్ను అందమైన జీవితం వైపు నడిపించాడు.

నా కూతురి కోసం బతకట్లేదు
అమ్మ స్థానం అమ్మదే.. కానీ, నాన్నే నా ప్రపంచం. నా కూతుర్ని నా లైఫ్‌లో మూడో వ్యక్తిగానే చూస్తాను. ఇదే మాట తనకూ చెప్తుంటాను. నా పేరెంట్స్‌, భర్త.. ఆ తర్వాతే నా కూతురికి ప్రాధాన్యతనిస్తాను. నా కూతురి కోసమే బతకట్లేదు. తనకోసం ఏదీ కొనిపెట్టలేదు, ఏదీ వెనకేయలేదు. తనకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. తన కోసం అన్నీ చేస్తే తనను బలహీనురాలిని చేసినట్లవుతుంది. 

నాన్న చేసిందే నేనూ..
తనకు నేనివ్వగలిగేది విద్య, ఆరోగ్యం. ఆ తర్వాత తన భవిష్యత్తు తనే నిర్మించుకోవాలి. తనకోసం ఆస్తులు కూడబెట్టలేదు.. కానీ, విహారయాత్రలకు తీసుకెళ్తా.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తాను. నాన్న ఏదైతే చేశాడో నేనూ ఇప్పుడదే చేస్తున్నా.. ఒక్కోసారి నా కూతురు మేముంటున్న ఫ్లాట్‌ను తనదే అంటుంది. నేను వెంటనే, అది నీది కాదని గుర్తు చేస్తాను. 

పేరెంట్స్‌ చేస్తుంది తప్పు
నాకున్నది ఒక్కటే జీవితం. దాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలి. ఐదు పైసలు కూడా తనకివ్వను. తను నాపై ఆధారపడకుండా ఎదగాలన్నదే నా కోరిక. పిల్లల కోసం డబ్బులు దాచిపెడుతూ తల్లిదండ్రులు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదే వారు చేస్తున్న పెద్ద తప్పు. వేరేవాళ్ల కోసం మనం బతకడం మొదలుపెడితే మన జీవితమైపోవాలి?

పిల్లలకు కోట్లు కాదు..
ముందు మీ జీవితాన్ని మీరు అనుభవించండి. దాన్ని చూస్తూ మీ పిల్లలు ఎదుగుతారు. వాళ్లకు అన్నీ అమర్చి పిల్లల్ని శిక్షించకండి. పిల్లలకు కావాల్సింది కోట్లు కాదు, ప్రేమ, మంచి జ్ఞాపకాలు. అలాగే వారికి మంచి విద్య ఇప్పించండి, నచ్చినరంగం వైపు వెళ్లనివ్వండి. అదే మనం చేయాల్సింది అని శ్వేతా మీనన్‌ చెప్పుకొచ్చింది. శ్వేతా మీనన్‌ తెలుగులో రాజన్న సినిమాలో దొరసానిగా నటించింది. గతేడాది నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది.

చదవండి: బిగ్‌బాస్‌ 9: తర్వాతి టార్గెట్‌ దివ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement