‘ప్రఫుల్‌’.. కేంద్రం పంపిన జీవాయుధం

Sedition Case Filed Against Filmmaker Ayesha Sulthana - Sakshi

అందుకే లక్షద్వీప్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్‌ 

నటి ఆయేషా సుల్తానా వివాదాస్పద వ్యాఖ్యలు

దేశద్రోహం కేసు నమోదు 

తిరువనంతపురం: లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ను జీవాయుధంతో పోల్చినందుకు గాను నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన బయోవెపన్‌గా ఆమె అభివర్ణించారు. మలయాళం న్యూస్‌ చానల్‌ మీడియా వన్‌ టీవీ చర్చలో పాల్గొన్న ఆయేషా సుల్తానా లక్షద్వీప్‌పై కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ ఆరోపించారు.

‘‘లక్షద్వీప్‌లో గతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు రోజుకి 100 కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్‌కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతోంది’’అని సుల్తానా టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లక్షద్వీప్‌ బీజేపీ చీఫ్‌ సి.అబ్దుల్‌ ఖదేర్‌ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరట్టి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 124 (ఏ) రాజద్రోహం, 153 బి (రెచ్చగొట్టే ప్రసంగాలు) కింద కేసు పెట్టారు. ఇప్పటికే ప్రఫుల్‌ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది.  

వెనక్కి తగ్గేది లేదు: ఆయేషా 
టీవీ చర్చల్లో తాను చేసిన వ్యాఖ్యల్ని ఆయేషా సుల్తానా సమర్థించుకున్నారు. రాజద్రోహం కేసు నమోదైనా భయపడేది లేదన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఆమె తన జన్మ భూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని చెప్పారు. తన గళం ఇంకా పెంచుతానంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ఉంచారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top