
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్ (Dude Movie). శరత్ కుమార్, రోహిణి, సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 17వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది.
థాంక్స్ గివింగ్ మీట్
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. చిత్ర నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ మాట్లాడుతూ డ్యూడ్ చిత్రం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలోనే కాకుండా, ఉత్తరాదిలో, అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అని పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కీర్తీ శ్వరన్, ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
దీపికాతో డ్యుయెట్‌కు రెడీ
డ్యూడ్ చిత్ర షూటింగ్‌కు వెళుతున్నామనగానే మనసులో సంతోషం కలిగేదని, అంత జాలీగా షూటింగ్ సాగిందని మమిత బైజు అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు, హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కని సందేశంతో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టొరీ డ్యూడ్ అని నటుడు శరత్ కుమార్ పేర్కొన్నారు. తాను ఇప్పుడు హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)తో డ్యుయెట్ పాడటానికి కూడా రెడీ అన్నారు. చాలా సెన్సిబుల్ కథను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.