రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని వాపోయింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. కేవలం వాటి గురించే ఈ రోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడానని పేర్కొంది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రేణు దేశాయి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.
వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ముందు ఇలాంటి రూమర్స్‌ను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబునెయిల్స్ రాస్తున్నారు. నేను ప్రెస్‌మీట్‌కు వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్ లైఫ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ విడిచిపెట్టింది. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంకా మాట్లాడుతూ..' నేను ఎవరి కోసం పోరాడుతున్నాను. నేను కుక్కల కోసం పోరాడటం లేదు. కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే. అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. అంతేకానీ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్‌లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను ప్రెస్ వాళ్ల మీద ఎక్కడా అరవలేదు. వంద కుక్కల్లో ఒక పది మెంటల్ కూడా ఉంటాయి. మనుషుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉంటారు. కొందరు చెడ్డవాళ్లు ఉంటారు. అవీ కూడా అంతే' అని రేణు దేశాయ్ వెల్లడించింది.


