రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం | Sakshi
Sakshi News home page

సినీ జగత్తును వీడి.. నింగికి.. చే'రావి'లా..

Published Wed, Jul 29 2020 8:17 AM

Ravi Kondal Rao Memories in East Godavari - Sakshi

ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనాలు, పాతతరం నటన ఏ విషయంలోనైనాఆయనకు ఉన్న పట్టు ఉన్న వేరొకరికి లేదనేది సినీ ప్రముఖుల మాట.. అందుకే ఆయనను చాలా మంది సినీ ఎన్‌సైక్లోపీడియా అని అంటుంటారు. పాత్రికేయుడిగా, రచయితగా, సహాయ దర్శకుడిగా, కారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సీనియర్‌ నటుడు రావి కొండలరావు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆయనకు జిల్లాతో అనుబంధం ఉంది. ఇక్కడ చిత్రీకరించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన జ్ఞాపకాలను పలువురు సినీప్రముఖులు, రచయితలు ‘సినీ జగత్తు నుంచి నింగికి చే‘రావి’లా అంటూ గుర్తు చేసుకున్నారు. 

రాజమహేంద్రవరం కల్చరల్‌: రావి కొండలరావు 1932 ఫిబ్రవరి11న జన్మించారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలో పెరిగి పెద్దయ్యారు. తన పదహారో ఏట చిల్లర డబ్బులు జేబులో వేసుకుని, నటుడు కావాలని రావి కొండలరావు మద్రాసు సెంట్రల్‌ స్టేషన్‌లో దిగాడు. అప్పటికే, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లి, సినిమాల్లో రాణించిన వారి చరిత్రలు ఆ అబ్బాయి కంఠస్థం చేశాడు. అక్కడి నుంచి పాత్రికేయుడిగా, రంగస్థల, సినీనటుడిగా, సినీ రచయితగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. నాగావళి నుంచి మంజీరా వరకు సాగిన ఆయన తన ప్రస్థానాన్ని ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పేరిట ఆత్మకథగా రచించారు. ఈ పుస్తక పరిచయ సభ కూడా రాజమహేంద్రవరంలో జరగడం విశేషం. హైదరాబాద్‌లో స్థిరపడి, అక్కడే మంగళవారం కన్ను మూశారు. 

బాల పత్రికతో అన్న ప్రాసన.. 
బాల పత్రికతో రావి కొండలరావు రచనా వ్యాసాంగం ప్రారంభమైంది. మద్రాసు నుంచి వెలువడే ఆనందవాణికి సంపాదకత్వం వహించారు. 1958లో శోభ సినిమాలో తొలి వేషం వేశారు. సుమారు 600 సినిమాల్లో నటించారు. అక్కినేనితో నటించిన ప్రేమించి చూడు, బ్రహ్మచారి, గృహలక్ష్మి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. బాపు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి పుస్తకానికి, రావి కొండలరావు రాసిన కథకు స్వర్ణ నంది బహుమతి లభించింది. 

సైలెన్స్‌.. 
సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై జరుగుతుండగా.. స్టేజీ మీదకు పేక బెత్తాం పట్టుకుని, హఠాత్తుగా ఎంటరై. సైలెన్స్‌ అని గద్దిస్తూ అందరినీ నవ్వించిన రావి కొండలరావు నటన, వ్యక్త్విత్వం అరుదైనవి.   

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం – గోదావరితో అనుబంధం 
ఆరెస్సెస్‌లో ఉండి, సత్యాగ్రహంలో పాల్గొనడంతో రావి కొండలరావు చిన్నతనంలోనే రాజమండ్రి జైల్లో మూడు నెలల కఠిన జైలు శిక్ష అనుభవించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు డీవీ హనుమంతరావు, ఎంవీ అప్పారావు, విశ్రాంత పోస్టల్‌ ఉద్యోగి మహ్మద్‌ ఖాదర్‌ఖాన్‌ ఇతర మిత్రులు కలసి రాజమహేంద్రవరంలో ‘హాసం’ క్లబ్‌ ప్రారంభించినప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డీఎడ్‌ కళాశాలలో జరిగిన ముళ్లపూడి వెంకటరమణ జయంత్యుత్సవంలో ఆయన పాల్గొని తన బాల్యమిత్రడు ముళ్లపూడి గురించి ప్రసంగించారు. 2016లో ఆనం కళాకేంద్రంలో ఆయనను నటుడు, గాయకుడు జిత్‌ మోహన్‌ మిత్రా చేతుల మీదుగా సన్మానించారు.

కళాకారులకు ఆదర్శప్రాయుడు ‘రావి’ 
కాకినాడ కల్చరల్‌: సీనియర్‌ నటుడు రావి కొండలరావు కళాకారులకు ఆదర్శప్రాయుడని నటుడు, దర్శకులు ప్రసాద్‌ అన్నారు. 2013లో సూర్యకళామందిర్‌లో తాను నిర్వహించిన మూర్తి కల్చరల్‌ అసోసియేషన్‌ 20 వార్షికోత్సవానికి రావి ముఖ్యఅతిథిగా హాజరయ్యారని తెలిపారు. రావి భార్య రాధాకుమారి కళాప్రాంగణాన్ని ప్రారంభించారని గుర్తు చేసుకొన్నారు. స్థానిక కళాకారులను, రావి కొండలరావును అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సత్కరించామని నాటి అనుభూతులను ప్రసాద్‌ గుర్తు చేసుకొన్నారు. రావి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

ఆయనతో కలసి నటించిన మదురక్షణాలు 
రావి కొండలరావుతో కలసి లోఫర్‌మామ–సూపర్‌ అల్లుడు, ప్రేమ చిత్రం–పెళ్లి విచిత్రం, స్నేహం సినిమాల్లో నటించాను. ఈ మూడు సినిమాలు రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆయనతో నటిస్తుంటే, టైం తెలిసేది కాదు. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. 
– శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా, నటుడు, గాయకుడు 

నాకు సన్నిహిత మిత్రుడు 
మేము ప్రారంభించిన హాసం క్లబ్‌ ప్రారంభోత్సవం ఆయన చేతులమీదుగా జరిగింది. ఆయన మాతో కలసి ఎంతో ఆత్మీయంగా ఉండే వారు. ఒక చిన్న పిల్లవాడైపోయేవారు. తెలుగు సినిమాల్లో సున్నితమైన హాస్యం ఆయనకే చెల్లింది. అక్కినేని నటించిన బ్రహ్మచారి సినిమాలో రక్త పరీక్ష చేసి, రిజల్టు చెప్పడానికి  వచ్చిన పాత్రలో ఆయన కనిపించేది రెండే నిమిషాలైనా, చిరస్మరణీయమైన హాస్యాన్ని ఆయన పండించారు. 
– డీవీ హనుమంతరావు, విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగి, శతక రచయిత 

Advertisement
Advertisement