777 Charlie: ట్రైలర్‌ చూడగానే కన్నీళ్లొచ్చాయి: రానా 

Rana Daggubati Talks About 777 Charlie - Sakshi

‘‘మంచి కథలను, చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో నేను యాక్టర్‌గా లేదా నిర్మాతగా... ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ‘చార్లీ 777’ వంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటుడు, నిర్మాత రానా. కన్నడ యాక్టర్‌ రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘చార్లీ 777’. సంగీత శ్రింగేరి ఫీమేల్‌ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 10న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ‘చార్లీ 777’ బిగ్‌ టికెట్‌ను రానా లాంచ్‌ చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ – ‘‘చార్లీ 777’ ట్రైలర్‌ చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాను చూసిన ప్రతిసారి ఎమోషన్‌ రెట్టింపు అవుతూనే ఉంది. రక్షిత్‌ శెట్టి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నవ్వుతారు.. ఏడుస్తారు. ఇలాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు.

‘‘ఈ సినిమాలో ధర్మ అనే పాత్ర చేశాను. ధర్మ జీవితంలోకి చార్లీ (పెట్‌ డాగ్‌) వచ్చిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అన్నదే కథ. ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్‌ అంకితభావం ఉన్న దర్శకుడు. చార్లీతో సీన్స్‌ చాలా కష్టంగా ఉండేవి. ఒకరోజు ఒకే షాట్‌ తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కశ్మీర్‌ ఎపిసోడ్‌ను మైనస్‌ 5 డిగ్రీల వాతావరణంలో తీశాం. చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో యానిమల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ దేవికా ఆరాధ్య పాత్రలో నటించాను’’ అన్నారు సంగీత శ్రింగేరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top