– నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
విరాట్ కర్ణ హీరోగా నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిశిత, కిషోర్ మాట్లాడుతూ– ‘‘మేం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించి, మరో వ్యాపారం చేయాలనుకుని సినీ పరిశ్రమకు వచ్చాం. ‘నాగబంధం’ కంటే ముందు ఓ పెద్ద హీరోతో సినిమా చేయాల్సింది. కానీ నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ చాన్స్ మా చేజారింది.
ఆ తర్వాత అభిషేక్ నామాగారి దగ్గర ఉన్న స్క్రిప్ట్ గురించి నిర్మాత రవీందర్ రెడ్డి చెప్పారు. అభిషేక్‌గారిని కలిశాం. ఆయన విజన్ నచ్చింది. ఈ సినిమాను దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలనుకున్నాం. కానీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రిస్క్ చేసి, రూ. 110 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాం. ఈ సినిమాకి విరాట్ కర్ణ పర్ఫెక్ట్ హీరో అనిపించారు. ఫిజికల్‌గా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.
సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేని మేం ఇంత భారీ సినిమా చేయడం దైవానుగ్రహంగా భావిస్తున్నాం. కార్తీక పౌర్ణమి రోజున ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరిగింది. అదే రోజు 24 గంటల పాటు షూట్‌లో భాగంగా శివునిపై అభిషేకం జరగడం ఆశీర్వాదం అనే భావన కలిగింది. ఈ సినిమా మేం ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే సీక్వెల్ చేస్తాం’’ అని చెప్పారు.


