తెలుగులో చాలావరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి. మిగిలింది క్రిస్మస్ మాత్రమే. దానికి ఇంకా చాలా సమయముంది. నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రిలీజులేం ఉండవు. ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి? వాటి సంగతేంటి?
గత రెండు నెలలు (సెప్టెంబరు, అక్టోబరు) టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది. నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రష్మిక ద 'గర్ల్ ఫ్రెండ్', దుల్కర్ సల్మాన్ 'కాంత', రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.
(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి సర్‌ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్)
తొలివారంలో రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్' రానుంది. ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. మరోవైపు మహేశ్ బాబు బావమరిది సుధీర్ బాబు 'జటాధర'తో ఈ వారమే రానున్నాడు. ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమింట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు. వీటితో పాటు తిరువీర్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం కూడా ఇదే వారం రానుంది.
రెండో వారంలో దుల్కర్ సల్మాన్ 'కాంత' వస్తుంది. ఓ దర్శకుడు, హీరో, హీరోయిన్.. వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్‌తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది. గతేడాది 'లక్కీ భాస్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్.. ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్‌లో సెటిలైపోవచ్చు. ఇదే రోజున చాందిని చౌదరి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ రానుంది. దీనిపై పెద్దగా అంచనాల్లేవు.
(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
మూడోవారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారంలో మాత్రం రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఒక్కటే రానుంది. మాస్‌ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్‌తో పూర్తిగా నిరాశపరిచిన రామ్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇతడి కోరిక 'ఆంధ్రా కింగ్ తాలుకా'తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి? ఈ చిత్రంతో పాటు 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్. అంటే రెండు వారాల గ్యాప్‌లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది.
పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ 'వృషభ' (నవంబరు 06), కృష్ణలీల (నవంబరు 7), ప్రేమిస్తున్నా (నవంబరు 07), స్కూల్ లైఫ్ (నవంబరు 14), ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' (నవంబరు 28) తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)


