దర్శకుడు శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

Non Bailable Warrant Against Director Shankar - Sakshi

చెన్నై: బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'ఎంథిరన్'‌ సినిమా వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అరూర్‌ తమిళ్‌నాడన్‌ అనే వ్యక్తి తను రాసిన 'జిగుబా' కథను కాపీ చేసి 'ఎంథిరన్'‌గా తీశారంటూ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశాడు. తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం కోర్టుకెక్కాడు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా శంకర్‌ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ రెండో కోర్టు అతడికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. (చదవండి: రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!)

కాగా తమిళ్‌నాడన్‌ రాసిన 'జిగుబ' కథ 1996లో ఓ మ్యాగజైన్‌లో పబ్లిష్‌ అయింది. తర్వాత 2007లో 'ధిక్‌ ధిక్‌ దీపిక ధీపిక' అనే నవలగా ప్రచురితమైంది. ఈ కథను కాపీ కొట్టి శంకర్‌ 'ఎంథిరన్'‌ తెరకెక్కించాడని, ఇది కాపీరైట్స్‌ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించాడు. తన స్వంత కథతో ఎంథిరన్‌ టీమ్‌ మొత్తం లాభం పొందిందని పేర్కొన్నాడు. ఇక ఎంథిరన్‌ తెలుగు, హిందీలో 'రోబో'గా డబ్‌ అవగా ఇక్కడ కూడా అఖండ విజయం సాధించింది. ఇందులో తలైవా రజనీకాంత్‌ డబుల్‌ యాక్షన్‌ చేయగా ఐశ్వర్యరాయ్‌ హీరోయిన్‌గా నటించింది. 2010లో రిలీజైన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top