ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా!

Nithiin Interview About Chek Movie - Sakshi

‘‘చెక్‌’ సినిమాకి ముందు చంద్రశేఖర్‌ యేలేటిగారు ఓ లైన్‌  చెప్పారు. రెండు నెలలు స్క్రిప్ట్‌పై పని చేశారు కూడా. అయితే అది వర్కవుట్‌ కాదనిపించింది. ఆ తర్వాత ‘చెక్‌’ కథతో ముందుకెళ్లాం. ఈ సినిమాలో క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆయన మార్క్‌ కనిపిస్తుంది. ‘చెక్‌’ తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నితిన్‌  అన్నారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌  హీరోగా నటించిన చిత్రం ‘చెక్‌’. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్‌  చెప్పిన విశేషాలు.

► వరుసగా మూడు ఫ్లాప్‌లు (లై, ఛల్‌ మోహన్‌ రంగ, శ్రీనివాస కళ్యాణం) వచ్చాయి. దీంతో తర్వాత చేసే సినిమాల్లో ఒకటి కమర్షియల్, మరొకటి వైవిధ్యమైన చిత్రం అయితే బాగుండు అనుకున్నాను. అందుకే ‘భీష్మ, చెక్‌’ సినిమాలు ఒప్పుకున్నాను. ‘భీష్మ’ తర్వాత ‘చెక్‌’ రిలీజ్‌ చేద్దామనుకున్నాం.. ఈలోపు లాక్‌డౌన్‌  వచ్చింది.

► నేనిప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్‌’ వేరు. ఈ చిత్రంలో నా నటన చాలా బాగుంటుంది. సినిమా ప్రివ్యూ చూసిన వంద మందిలో అందరూ బాగుందని అభినందించారు. పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ‘చెక్‌’ ఉంటుంది. ఒక పాట మినహా మొత్తం కథే ఉంటుంది. ప్రేక్షకులకు మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది.

► కల్యాణీ మాలిక్‌ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కమర్షియల్‌ సినిమాల బడ్జెట్‌కి నిర్మాతలు వెనకాడరు. ‘చెక్‌’లాంటి వైవిధ్యమైన సినిమాకి ఖర్చు పెట్టిన ఆనంద్‌ ప్రసాద్‌గారు గ్రేట్‌.. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయనకి డబ్బులు బాగా రావాలి. ‘నితిన్‌  ఎప్పుడూ కొత్తగా ట్రై  చేస్తాడు’ అని ‘చెక్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజమౌళిగారి నుంచి నాకు కాంప్లిమెంట్‌ రావడం హ్యాపీ. నా తొలి చిత్రం ‘జయం’ తర్వాత ఎక్కువ టేకులు తీసుకున్నది ‘చెక్‌’ చిత్రానికే. మొదట్లో ఓ వారంపాటు ఒక్కో సీన్స్‌ కి 10 నుంచి 15 టేకులు తీసుకున్నాను. ఆ తర్వాత డైరెక్టర్‌ పల్స్‌ పట్టుకుని ఆయనకు నచ్చినట్టు చేశా.

► ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అయింది. ఇప్పటికీ లవర్‌ బోయ్‌ ట్యాగ్‌లైన్‌  నాకు నచ్చదు. గతంలో కథల ఎంపికలో తప్పు చేశాను. ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నాను.

► 2020 చాలామందికి వరస్ట్‌ అయితే నాకు గుడ్‌. ‘భీష్మ’ సినిమా హిట్‌ అయింది. షాలినీతో పెళ్లయింది. యాక్టర్‌ ఫ్యామిలీకి, డాక్టర్‌ ఫ్యామిలీకి బాగా సింక్‌ అయింది. గతంలో జలుబో, దగ్గో, జ్వరమో వస్తే హాస్పిటల్‌కి వెళ్లేవాణ్ణి.. ఇప్పుడేమో మా మావయ్య– అత్తయ్యలకు ఫోన్‌  చేసి, ఏ మందులు వేసుకోవాలో అడుగుతున్నాను (నవ్వుతూ).

► ‘రంగ్‌ దే’ సినిమా షూటింగ్‌ మంగళవారమే పూర్తయింది. మేర్లపాక గాంధీతో ‘అంధా ధున్‌ ’ రీమేక్‌ సినిమా చేస్తున్నా. ‘పవర్‌పేట’ సినిమా మేలో స్టార్ట్‌ అవుతుంది.. డిసెంబరులో మొదటి పార్ట్‌ విడుదలవుతుంది.. అది హిట్‌ అయితే రెండో పార్ట్‌ ఉంటుంది.. లేకుంటే లేదు. నా సినిమాల్లో ‘సై’కి సీక్వెల్‌ చేయొచ్చు.. ‘చెక్‌’ సినిమాకి కూడా సీక్వెల్‌ చేసే అవకాశం ఉంటుంది. పవన్‌  కల్యాణ్‌గారితో మల్టీస్టారర్‌ మూవీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top