
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో బాగుందనే టాక్ వస్తే తప్పితే కొత్త సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే ఇలా జరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ మేరకు ట్వీట్ చేయడంతో సదరు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)
మిగతా చోట్ల ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు చాలా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కళ్లు చెదిరేలా ఉంటాయి. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్ కూడా తినుబండరాల ధరలు చూసి షాకయ్యాడు. తను కొన్న టికెట్ రేటు కంటే వీటికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ట్విటర్‌లో చెప్పుకొచ్చాడు. కనీసం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లేందుకైనా అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ కాస్త దృష్టి పెడితే బాగుంటుందని, అప్పుడే జనాలు థియేటర్లకు వస్తారని అన్నాడు.
కొన్నిరోజుల ముందు నిర్మాత నాగవంశీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయమై తన అనుభవాన్ని బయటపెట్టారు. తలో రెండు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఏకంగా రూ.1000కి పైనే అయ్యాయని అన్నారు. దీంతో ఇప్పుడీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు.. జనాలు థియేటర్లకు రావట్లేదని తెగ బాధపడిపోతున్నారు. అయితే కంటెంట్ విషయంలో దృష్టి పెట్టడంతో పాటు వీటి రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే జనాలు కాస్తోకూస్తో రావడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే మాత్రం పూర్తిగా ఓటీటీలకు అలవాటు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?)
