'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..! | Hema Malini on Dharmendra omission from Oscars In Memoriam is a shame | Sakshi
Sakshi News home page

Hema Malini: 'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..!

Mar 17 2026 6:55 AM | Updated on Mar 17 2026 3:42 PM

Hema Malini on Dharmendra omission from Oscars In Memoriam is a shame

ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు.

అయితే తాజాగా ధర్మేంద్రకు ఆస్కార్ నివాళి అర్పించడంపై ఆయన భార్య  హేమ మాలిని స్పందించారు. ఆస్కార్‌ వేదికపై ప్రసారం చేసిన మెమోరియంలో ధర్మేంద్ర ఫోటోలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇలా ప్రదర్శించడం ఆ అవార్డుల వేడుకకే సిగ్గు చేటని హేమ మాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం అవార్డులు మాత్రమే ఆయన కెరీర్‌ను నిర్ణయించలేవని తెలిపారు.

హేమ మాలిని మాట్లాడుతూ.. 'ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్కార్‌ల గురించి ఎందుకు పట్టించుకోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం.  లాల్ పత్తర్, మీరా చిత్రాలలో నా ఉత్తమ నటనకు కూడా ఎటువంటి అవార్డు రాలేదు' అని తెలిపింది.

‍అయితే ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా  డయాన్ కీటన్, కేథరీన్ ఓహారా, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, ఉడో కీర్, రాబ్ రైనర్, రాబర్ట్ డువాల్, జీన్ హాక్‌మన్, వాల్ కిల్మర్‌లతో లాంటి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు మాత్రమే అకాడమీ నివాళులర్పించింది. ఆ తర్వాత ధర్మేంద్రతో పాటు మరో నటుడు మనోజ్ కుమార్‌లను అధికారిక ఆస్కార్ వెబ్‌సైట్‌లో ఇన్ మెమోరియం జాబితాలో చేర్చారు.  కాగా..  సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు సైతం ఆస్కార్ అకాడమీ నివాళులర్పించింది. 

Advertisement
 
Advertisement
Advertisement