– నిధీ అగర్వాల్
‘‘ది రాజా సాబ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా కోసం యూనిట్ అంతా మూడేళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారని భావిస్తున్నాం. ఈ సినిమాలో నన్‌గా నేను చేసిన బెస్సీ రోల్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను’’ అని నిధీ అగర్వాల్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు.
టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల అయింది. ఈ నేపథ్యంలో నిధీ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ది రాజా సాబ్’లో తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా చూపించారు మారుతిగారు. ప్రభాస్‌గారు తానో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో విశ్వప్రసాద్‌గారు రాజీ పడలేదు.
‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఒకే సమయంలో చేశాను. ఈ సినిమాల షూటింగ్స్, ప్రయాణం వల్ల నిద్ర కూడా ఉండేది కాదు. ఆ టైమ్‌లో ‘రాజా సాబ్’ మేకర్స్ సెట్‌లో నన్ను బాగా చూసుకునేవారు. అందుకే నేనంటే సెట్‌లో అందరికీ ఇష్టమని ప్రభాస్‌గారు చెప్పారు. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఎందుకంటే... మేమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు.


