
‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అథర్వ’ చిత్రం రూపొందింది. హత్య, దోపిడీ సన్నివేశాలతో ఈ కథను అల్లుకున్నాను. వాస్తవ ఘటనలకు కొంచెం ఫిక్షన్ జోడించాను’’ అని దర్శకుడు మహేశ్ రెడ్డి అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేనొకసారి క్లూస్ టీమ్ హెడ్ వెంకన్నగారి ఇంటర్వ్యూ చూశాను. క్రైమ్ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీమ్ పరిష్కరిస్తుంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న క్లూస్ టీమ్ గురించి చెప్పాలని ‘అథర్వ’ కథ రాశాను. కార్తీక్ రాజు క్లూస్ టీమ్‌లో పని చేస్తుంటాడు. హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు’’ అన్నారు.