మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ లవ్‌ స్టోరీ..

Madhuri Dixit, Sanjay Dutt Breakup Love Story - Sakshi

మెరా దిల్‌ భీ కిత్నా పాగల్‌ హై యే ప్యార్‌ తో తుమ్‌సే కర్‌తా హై..
పర్‌ సామ్‌నే జబ్‌ తుమ్‌ ఆతే హో కుచ్‌ భీ కహ్‌నే సే డర్తా హై.. 
ఓ మేరే సాజన్‌.. ఓ మేరే సాజన్‌... 

1990ల్లో యువ హృదయాల మధురాలాపనగా మిగిలిపోయిన పాట అది. ‘సాజన్‌’ సినిమాలోనిది. ఆ చిత్రాన్ని కూడా ఓ ప్రేమ కావ్యంలా ఆరాధించింది నాటి యువత. ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్‌ల నిజమైన ప్రేమా కథలుకథలుగా మీడియాలో అచ్చేసుకుంది. ‘నిజమే’ అని ఆ ఇద్దరూ స్పష్టం చేయకపోయినా అకస్మాత్తుగా వేరైన వాళ్ల దారులు ఆ కథనాలు వాస్తవమనుకునేలా చేశాయి. 

ఆ సినిమాతోనే మొదలు..
మాధురి, సంజయ్‌ దత్‌ సాజన్‌ కంటే ముందు నాలుగు సినిమాల్లో కలసి నటించారు. ఆ సాన్నిహిత్యంతో మంచి స్నేహితులుగా మారారు. సినిమాల్లో హిట్‌ పెయిర్‌గా పేరూ తెచ్చుకున్నారు.  సాజన్‌ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ టైమ్‌లో మాధురి.. పత్రికలకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సంజయ్‌ దత్‌ గురించి  ‘సినిమాల్లో నా ఫేవరేట్‌ పార్ట్‌నర్‌. నన్ను భలే ఎంటర్‌టైన్‌ చేస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. రియల్‌ జోకర్‌ అండ్‌ జెంటిల్‌మన్‌’ అని ఒకసారి,  ‘ఎమోషన్స్‌తో  గేమ్స్‌ ఆడే జిత్తులమారి కాదు సంజు. స్వచ్ఛమైన మనసు అతనిది. ప్రేమగల మనిషి.

ఫెంటాస్టిక్‌ పర్సన్‌. మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ అతని సొంతం. ఈ ప్రపంచంలో నన్ను నవ్వించే మనిషి అతనొక్కడే’ అంటూ ఇంకోసారి తన మనసులో మాటలను పంచుకుంది.  సాజన్‌ సినిమా షూటింగ్‌ కబుర్ల కంటే మాధురి ఇంటర్వ్యూలే పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న ఊహలనూ రేపాయి. పత్రికలూ ఆ డాట్స్‌ను కనెక్ట్‌ చేసుకుంటూ మాధురి, సంజయ్‌ల ఇష్క్‌కి స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాయి. ఈలోపు ‘సాజన్‌’ విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. వాళ్ల ప్రేమ కథా పత్రికలకు కవర్‌ స్టోరీ అయింది.  మాధురి, సంజయ్‌లకు ఒకరంటే ఒకరికి ఉన్న పట్టింపు, శ్రద్ధ, పెరిగిన చనువును చూసి పరిశ్రమలో వాళ్లూ అనుకున్నారు ‘వాళ్లిద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు’ అని. 

ఏమైంది మరి?
సంజయ్‌ దత్‌కి అదివరకే పెళ్లయింది. ఒక కూతురు కూడా.  కాని స్పర్థలతో విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు విడాకులు తీసుకోకుండా. ఈలోపే భార్య రీచా శర్మ క్యాన్సర్‌ బారిన పడింది. చికిత్స కోసం  న్యూయార్క్‌ వెళ్లింది. సంజయ్, మాధురిల ముచ్చట అక్కడున్న రిచాకు చేరింది. చింత పడింది. ‘నాకు విడాకులివ్వాలనుకుంటున్నావా?’ అని అడిగింది భర్తను. ‘ఛ.. అలాంటి ఆలోచనేం లేదు’ అన్నాడు సంజయ్‌. కాస్త కుదుటపడినా.. అక్కడ ఉండలేకపోయింది. కూతురిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. కానీ వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు కనిపించింది రిచాకు. తన పట్ల అతనిలో మునుపటి ఆదరణ లేదు. పైగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తట్టుకోలేకపోయింది. అందుకే వచ్చినంత వేగంగా.. కేవలం పదిహేను రోజుల్లోనే తిరిగి న్యూయార్క్‌ వెళ్లిపోయింది రిచా కూతురిని తీసుకొని చెదిరిన మనసుతో.

‘విడాకులు తీసుకోలేదు. తీసుకోవాలని ఆయనకు, నాకూ లేకుండింది.  మళ్లీ కలసి ఉంటామనే అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. కలిసున్నా లేకపోయినా.. ఆయన నన్నెలా ట్రీట్‌ చేసినా ఐ లవ్‌ హిమ్‌. ఆయన నా ప్రాణం’ అని చెప్పింది రిచా. తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్‌తో కన్ను మూసింది ఆమె. ‘మాధురి, సంజయ్‌ మంచి ఫ్రెండ్స్‌ అనుకున్నాం. వాళ్లిద్దరిమధ్య ఇంకేదో ఉందని మేమేనాడూ అనుమానించలేదు. సంజయ్‌ స్పేస్‌ను రెస్పెక్ట్‌ చేశాం. అయినా మా అక్కతో అంత నిర్దయగా ప్రవర్తించిన మనిషిని ఎలా కావాలనుకుంటుందో మరి మాధురి?’ అని కామెంట్‌ చేసింది రిచా శర్మ చెల్లెలు ఇనా శర్మ.

టాడా..
భార్యకు దూరమైన సంజయ్‌.. ప్రేమను దక్కించుకొని మాధురీకి దగ్గరయ్యాడా అంటే అదీ జరగలేదు. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్‌ మీద కేస్‌ నమోదైంది. జైలుకీ వెళ్లాడు. ఈ పరిణామానికి మాధురి షాక్‌ అయ్యింది. వెంటనే సంజయ్‌తో గడిపిన కాలానికి చెక్‌ పెట్టింది. ఆ జ్ఞాపకాలు మెదలకుండా మెదడును కట్టడి చేసుకుంది. జైల్లో ఉన్న సంజయ్‌ను కనీసం పలకరించడానిక్కూడా వెళ్లకుండా ఉండేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆమెకు అపరిచితుడయ్యాడు. మాధురి ఈ నిర్ణయం సంజయ్‌ను బాధించింది. లోలోపలే కుమిలిపోయాడు. జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఏమీ ఫీలవలేదు.

నాతో నటించే ప్రతి నటితో మంచి ర్యాపోతో ఉండాల్సి వస్తుంది. మాధురీతో అలాగే ఉన్నాను. అందుకే ఆమె మాటలు కానీ, చేతలు కానీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.. చూపవు కూడా’  అని చెప్పాడు సంజయ్‌. మరో పత్రికా విలేకరి ఇంకో సందర్భంలో మాధురితో ప్రేమ, పెళ్లి మీద  వచ్చిన ప్రచారాన్ని  గురించి అడిగితే.. ‘నాకూ అనిపిస్తుంది మాధురితో నా లైఫ్‌లో లవ్‌ సీన్‌ ఉంటే బాగుండు అని.. కానీ లేదు కదా. ఇక పెళ్లి అంటారా.. అసలు మా మధ్య ఏమీలేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది?’ అని కొట్టిపారేశాడు సంజయ్‌. మాధురిని దృష్టిలో పెట్టుకొని.. ఆమె ఇబ్బంది పడకుండా ఉండడానికే సంజయ్‌ అలా చెప్పాడు అంటారు అతని సన్నిహితులు. 

చాలా ముందుకెళ్లింది
సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ సినిమా విడుదలప్పుడు మళ్లీ వాళ్ల లవ్‌ స్టోరీ గుర్తొచ్చింది మీడియాకు. మైక్‌ తీసుకెళ్లి మాధురి ముందు పెట్టారు.. ‘ఇప్పుడు ఆ విషయం అనవసరం. ఇన్నేళ్లలో జీవితం చాలా ముందుకెళ్లింది’ అని జవాబు చెప్పింది మాధురి. 2019లో ‘కళంక్‌’ అనే సినిమా వచ్చింది. సంజయ్‌ దత్, మాధురీ కలసి నటించిన సినిమా! పర్సనల్‌ లైఫ్, ప్రొఫెనల్‌ లైఫ్‌ రెండు వేర్వేరు అన్నదానికి సూచనగా.
- ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top