OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా? | Made In Korea Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Made In Korea Review: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా

Apr 12 2026 6:23 PM | Updated on Apr 12 2026 6:29 PM

Made In Korea Movie Review In Telugu

పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్‌కు అదొక ఎమోషన్‌. కొరియన్‌ కల్చర్‌కు పట్టం కట్టే వెబ్‌ సిరీస్, కె–పాప్‌...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు.  అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్‌ కల్చర్‌... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.

విదేశీ కలల విహారం...
 ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే  సినిమా కథలు మనం గతంలో చూశాం.  పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్‌ ఇన్‌ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్‌ డేల్‌ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్‌బా అనే యువతి కలల కధే ఈ మేడ్‌ ఇన్‌ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ  అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి  కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య  గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం  ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా  సాగుతుంది?  అనేదే ఈ కథ.

కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...
కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్‌గా, ఎక్కడా రిస్క్‌ తీసుకోకుండా సాగుతుంది. ఇది  కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్‌బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే  ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్‌ సీన్స్‌ మనసును తాకుతాయి.  యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ  కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్‌ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్‌ డేల్‌ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.

ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్‌ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్‌ కల్చర్‌ మిక్స్‌ కొత్తగా అనిపించడం మరో బలం.

అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్‌గా ముగించేయడం ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో  అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే  ‘‘మేడ్‌ ఇన్‌ కొరియా’’ ఒక లైట్, ఫీల్‌ గుడ్‌ సినిమా. ఒక వీకెండ్‌లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్‌ ఇన్‌ కొరియా బెస్ట్‌ ఛాయిస్‌.  ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement