Laal Singh Chaddha Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha Movie Review: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ మూవీ రివ్యూ

Published Thu, Aug 11 2022 1:09 PM

Laal Singh Chaddha Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : లాల్‌సింగ్‌ చడ్డా
నటీనటులు : ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగచైతన్య, మోనా సింగ్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:  వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాతలు:ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
దర్శకత్వం: అద్వెత్‌ చందన్‌
సంగీతం : ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సేతు
విడుదల తేది:ఆగస్ట్‌ 11,2022

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత  బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’.  కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సమర్పించడం.. నాగచైతన్య కీలక పాత్ర పోషించడంతో టాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే  విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


‘లాల్‌సింగ్‌ చడ్డా’ కథేంటంటే.. 
ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్‌సింగ్‌ చడ్డా(ఆమిర్‌ ఖాన్‌)..అంగవైకల్యంతో పుడతాడు. సరిగా నడవలేడు. అతనికి ఐక్యూ(IQ) కూడా తక్కువే. కానీ అతని తల్లి (మోనా సింగ్‌)మాత్రం కొడుకుని అందరి పిల్లలా పెంచాలనుకుంటుంది. ప్రత్యేకమైన పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్‌కే పంపుతుంది. అక్కడ అందరూ హేళన చేస్తు అతనితో దూరంగా ఉంటే..రూప(కరీనా కపూర్‌) మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తల్లి చెప్పే మాటలు.. రూప ప్రోత్సాహంతో లాల్‌ సాధారణ వ్యక్తిలాగే ఉంటాడు. తనకు అంగవైకల్యం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతాడు.

ఓ సందర్భంలో రూప చెప్పే మాటలతో పరుగెత్తడం మొదలుపెడతాడు. ఎంతలా అంటే.. ప్రతి రన్నింగ్‌ రేస్‌లో విజయం సాధించేలా. అలాగే కాలేజీ విద్యను పూర్తి చేసి తన తండ్రి, తాత, ముత్తాతల మాదిరే ఆయన కూడా ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. జవాన్‌గా లాల్‌ దేశానికి చేసిన సేవ ఏంటి? యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు బాలు అలియాస్‌ బాలరాజు(నాగచైతన్య)చివరి కోరిక ఏంటి? ఆ కోరికను లాల్‌ నెరవేర్చాడా లేదా? చిన్ననాటి స్నేహితురాలు రూప పెద్దయ్యాక పడిన కష్టాలేంటి? ఆపదలో ఉన్న సయమంలో లాల్‌ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? తన అమాయకత్వంతో పాకిస్తాన్‌ ఉగ్రవాది మహ్మద్‌బాయ్‌ని ఎలా మంచి వాడిగా మార్చాడు? లాల్‌ తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్స్‌లో లాల్‌సింగ్‌ చడ్డా’సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేకే ‘లాల్‌సింగ్‌ చడ్డా’. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..భారతీయ నేటివిటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అద్వెత్‌ చందన్‌. అయితే అది తెరపై వర్కౌట్‌ కాలేదు.  స్క్రీన్‌ప్లే, నిడివి సినిమాకు పెద్ద  మైనస్‌. కథంతా ఒకే మూడ్‌లో సింపుల్‌గా సాగుతుంది. 1975 నుంచి 2018 వరకు భారత్‌లో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తూ కథనాన్ని నడిపించాడు.

సినిమా ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. లాల్‌ ఆర్మీలో జాయిన్‌ అయిన తర్వాత కొంచెం ఆసక్తిగా సాగుతుంది. బాలరాజుతో పరిచయం.. బనియన్‌, చెడ్డి బిజినెస్‌ అంటూ ఇద్దరు చెప్పుకునే కబుర్లు కొంచెం కామెడీని పండిస్తాయి. కార్గిల్‌ వార్‌ సన్నివేశాలు మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. ఎమోషనల్‌ సీన్‌తో ఇంటర్వెల్‌ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్‌ సీన్స్‌గా తేలిపోవడంతో ప్రేక్షకులు బోరింగ్‌ ఫీలవుతారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అయితే చిరాకు తెప్పిస్తాయి. రొటీన్‌ స్టోరీకి రొటీన్‌ క్లైమాక్స్‌ మరింత మైనస్‌. స్క్రిప్ట్‌ రైటర్‌గా అతుల్‌ కులకర్ణి  మాతృకకు ఎలాంటి భంగం కలగకుండా మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయితే..  దానిని తెరకెక్కించడంలో దర్శకుడిగా అద్వైత్‌ ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే.. 
ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం ఆమిర్‌కు అలవాటు. ఈ చిత్రంలో కూడా ఆమిర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్‌ చడ్డా పాత్రలో జీవించేశాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ‘పీకే’సినిమాను గుర్తుచేస్తుంది. 

రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మధ్య మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఇక జవాన్‌ బాలరాజు పాత్రతో నాగచైతన్య ఒదిగిపోయాడు. నటుడిగా మరింత ఇప్రూవ్‌ అయ్యాడనే చెప్పాలి. ఇక లాల్‌ తల్లి పాత్రలో మోనాసింగ్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్‌ పాటలు బాగున్నాయి. తనూజ్‌ టికు నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే.సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాప్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రాన్ని చూడకుండా, ఆమిర్‌ నటనని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం కాస్తో కూస్తో నచ్చే అవకాశం ఉంది. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement