
'బాహుబలి'.. టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే పాన్ ఇండియా అనే సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్, సీక్వెల్స్ అని ఎగబడుతున్నారంటే దానికి ఓ రకంగా ఈ మూవీనే కారణమని చెప్పొచ్చు. అయితే ఈ చిత్ర రెండు భాగాల్ని ఒక్కటిగా చేసి 'బాహుబలి: ద ఎపిక్' పేరుతో అక్టోబరు 31న రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే 'బాహుబలి' యూనివర్స్ నుంచి ఓ కొత్త సినిమా రాబోతుందనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.
రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం కట్టప్ప పాత్ర బ్యాక్ స్టోరీ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. అసలు కట్టప్ప ఎవరు? మాహిష్మతి సామ్రాజ్యానికి అతడు కట్టు బానిసగా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు కట్టప్ప వంశం ఏంటి? అనే అంశాల చుట్టూ కథ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం చేస్తారా? లేదంటే వేరే ఎవరైనా వస్తారా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?)
ప్రస్తుతానికైతే ప్రీ విజువలైజేషన్ వర్క్ మొదలైందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుందనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా నిజమేనా? లేదంటే 'బాహుబలి' రీ రిలీజ్‌లో భాగంగా ఈ రూమర్స్ వస్తున్నాయా అనేది చూడాలి? ఒకవేళ నిజమైతే మాత్రం దాన్ని ఏ మేరకు ఆసక్తికరంగా తెరకెక్కిస్తారా అనేది సస్పెన్స్.
రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నారు. అడ్వెంచర్ జానర్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా అడవుల్లో షూటింగ్ చేశారు. కొన్నాళ్ల క్రితం కెన్యా కూడా వెళ్లొచ్చారు. 'బాహుబలి' రీ రిలీజ్ తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))