అందరికీ నవ్వులు పంచే కమెడియన్ జీవితాల్లో ఎంతో విషాదం దాగి ఉంటుంది. జబర్దస్త్ కమెడియన్ నరేశ్ (Jabardasth Naresh) జీవితమూ అంతే! ఒకప్పుడు ఎన్నో కష్టాలు చూసిన అతడు కామెడీ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు.
స్క్రాప్ షాప్
జబర్దస్త్ నరేశ్ మాట్లాడుతూ.. మాకు చిన్నప్పటినుంచి పెద్ద ఆస్తులేమీ లేవు. నాన్నకు ట్రాలీ ఆటో ఉండేది. సరిగా ఈఎమ్‌ఐ కట్టలేక ఫైనాన్స్ వాళ్లు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయేవారు. మాకు చిన్న దుకాణం ఉండేది. అది స్క్రాప్ షాప్.. పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలు కొనేవాళ్లం. అవి ఎక్కువ జమయ్యాక వాటిని అమ్ముకునేవాళ్లం.
షాప్ అమ్ముకునే దుస్థితి
నేను కూడా ఆ షాప్‌లో కూర్చునేవాడిని. ఇంట్లో పరిస్థితులు బాగోలేక దాన్ని అమ్ముకునే దుస్థితికి చేరుకున్నాం. పైగా నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాను. ఒకరోజు ఢీ జూనియర్స్ ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ పరిచయమైన వ్యక్తి నన్ను జబర్దస్త్‌కు తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాను.
సినిమాలకు షిఫ్ట్ అవుతా
ఆ మధ్య నేను బాగా కమర్షియల్.. అని ప్రచారం జరిగింది. ఇలాంటి స్నేహితుడుంటే కట్ చేసేయండి అని నన్ను విమర్శించారు. కానీ, నేనంత కమర్షియల్ కాదు. సినిమా అవకాశాలు వస్తున్నాయి.. కానీ డేట్స్ సరిగా సర్దుబాటు కావడం లేదు. అందుకే ఆర్థికంగా సెటిలైన తర్వాత సినిమాలకు షిఫ్ట్ అవుతాను అని నరేశ్ చెప్పుకొచ్చాడు.


