ఐబొమ్మ అనే సినిమా పైరసీ వెబ్‌సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్‌న్ ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఇమ్మడి రవి సంపాధించాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తన మనస్తత్వాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. చిన్న తనం నుంచి కాలేజీ రోజులు ఆపై తన పెళ్లి వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే, డబ్బు కోసం జీవితంలో ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బాగా డబ్బున్న ముస్లిం కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకురావడం కష్టమైంది. రోజువారి కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడటం.. ఆపై కూతురు కూడా ఉండటంతో ఖర్చలు మరింత పెరగడం జరిగింది.
దీంతో భార్యభర్తల మధ్య గొడవలు రావడం మొదలైంది. డబ్బు సంపాదించి పోషించడం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేక పోయాడు. ఈ క్రమంలో వెబ్ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో పైరసీ దందాలోకి దిగి.. 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ పేర్లతో వెబ్‌సైట్లు ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోటి తెరుస్తూ మొత్తం 65 మిర్రర్ సైట్లు రూపొందించాడు. కొద్దిరోజులకే బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో తను ఎన్నడూ ఊహించనంత డబ్బు వచ్చేసింది. కానీ, తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని భార్యకు చూపించినప్పటికీ అతనితో కలిసి ఉండేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో 2021లో వారిద్దరూ విడిపోయారు.
ఆ ఘటన తర్వాత నెదర్లాండ్ వెళ్లిపోయాడు అక్కడే హోస్ట్ సర్వర్లను పెట్టాడు. కరేబియన్ దీవులతోపాటు ఫ్రాన్స్, దుబాయ్‌ల్లోనూ సంచరిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్‌సైట్లు హోస్ట్ చేశాడు. ప్రస్తుతం తన ఖాతాలో రూ. 20 కోట్లకు పైగా డబ్బు ఉంది. ఇప్పటికే రూ. 3 కోట్లు సీజ్ చేశారు. అయితే, కూకట్‌పల్లిలోని తన ఫ్లాట్‌ను విక్రయించి విదేశాల్లోనే స్థిరపడిపోవాలని హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయాడు.


