
ఉత్తరాదికి చెందిన నటి జెనీలియా. ఈమె 2003లో తుఝే మేరీ కస్సమ్ చిత్రం ద్వారా నటిగా బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం తమిళంలోనూ బాయ్స్ చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళం తెలుగు హిందీ మరాఠీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. అయితే ఈమె తెలుగులోనే క్రేజీ కథానాయకిగా రాణించారు. తమిళంలోనూ నటుడు విజయ్, జయం రవి వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు.
కాగా నటిగా ఉచ్చ దశలో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన దక్షిణాదిలో మాత్రం నటించలేదు. అలాంటిది తాజాగా మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది .
చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను పక్కన పెట్టేసిందని చెప్పారు. కొందరు హిందీ దర్శక నిర్మాతలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నావుగా అక్కడికే వెళ్లిపో అని చెప్పారన్నారు. అయితే తనకు దక్షిణాది చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని, అసలు తనకు నటనపై ఆసక్తి కలగడానికి కారణమే దక్షిణాది చిత్రాలు అని పేర్కొన్నారు.