సంగీత దర్శకుడు, నటుడు రఘుకుంచె టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘గేదెల రాజు’. టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి, వికాస్ ఇతర పాత్రల్లో నటించారు. రఘు కుంచె సమర్పణలో చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా రఘుకుంచె విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్క్రీన్‌పై నేను ఆద్యంతం ఉండే పాత్రలో నటించిన ‘గేదెల రాజు’ నాకు ప్రత్యేకం. ఈ మూవీ కోసం 12 కేజీల బరువు పెరిగాను. ఓ ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా సమయానికి డూప్ కత్తులు దొరక్కపోవడంతో నిజమైన కత్తులు వాడాం.
ఇవి ఎక్కడ గాయపరుస్తాయేమోనని ఆ సమయంలో భయం వేసింది. ఈ సినిమా కోసం దర్శకుడు చైతన్య, అతని టీమ్ చాలా కష్టపడ్డారు. ఆ కష్టం చూసి ఈ సినిమాలో నేనూ భాగస్వామ్యం కావాలనుకుని సమర్పకుడిగా మారాను. ఇప్పుడు నేపథ్య సంగీతం అంటే శబ్దంలా మారిపోయింది.
కానీ, ఈ చిత్రంలో నేను మాత్రం క్యారెక్టర్‌ను బీజీఎం డామినేట్ చేయకుండా సెటిల్డ్‌గా కంపోజ్ చేశాను. మా సినిమాను నైజాంలో మైత్రీవాళ్లు 100కిపైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఏపీ–తెలంగాణ లో 200 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 60చోట్ల మా సినిమా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌గారి సినిమాతో పాటు రైటర్ కల్యాణ చక్రవర్తి రూపొందిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నాను’’ అని చెప్పారు.


