Drishyam Movie: దేవదాస్‌ తర్వాత ఎక్కువగా రీమేక్‌ అవుతున్న సినిమా ఇదే!

Drishyam Movie To Be Remade in Many Languages - Sakshi

ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్‌ హిట్‌. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్‌ హిట్‌. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్‌ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్‌ అయితే ఆ భాషలో హిట్‌. ఇప్పుడు ఇంగ్లీష్‌ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్‌ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్‌ ఇండియా’ అంటున్నాం. ‘పాన్‌ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్‌ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్‌ ఇండియా కథ!  ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం.

తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్‌ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్‌ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ జోడించి జీతూ జోసెఫ్‌ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్‌ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్‌ అండ్‌ ఆంటోనీ పెరుంబవూర్‌. తొలి భాగంలానే పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్‌’(ఇందులో మోహన్‌లాల్‌ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్‌ చేసి ఉండేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయయపడ్డాయి.

తొలి  ఇండియన్‌ మూవీ!
‘దృశ్యం’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో పాటు పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్‌ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్‌)గా రీమేక్‌ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్‌ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్‌ దేవగన్‌)గా రీమేక్‌ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్‌ వితవుట్‌ షెపర్డ్‌’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్‌ అయ్యింది.

ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్‌ అయిన తొలి ఇండియన్‌ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్‌ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్‌ పరంగా హిట్‌ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్‌ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్‌ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్‌ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్‌ టెన్‌ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్‌ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్‌’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్‌ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్‌.

మాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి...
‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ రీమేక్‌ హక్కులను పనోరమ స్టూడియోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్‌ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్‌ లాంగ్వేజెస్‌ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్‌లో ‘దృశ్యం’ను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్‌ రీమేక్‌ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

కథ ఏంటంటే...
సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్‌ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్‌ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ.  మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్‌లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ.

చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top