
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ .ఎన్ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శక–నిర్మాత మారుతి సమర్పణలో అడిదెల విజయ్‌పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని సంగీతం నేర్చుకుని, ఎన్నో ఈవెంట్స్‌లో పాటలు పాడాను. ఇన్ని రోజులు నాకు సంగీతమే తిండి పెట్టింది.
దర్శకుడిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ నా తొలి చిత్రం. నేను కథను అద్భుతంగా నరేట్ చేయగలను. అలా మారుతిగారికి చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఆగస్టు 15 సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంట్రవెల్, ఆగస్టు 15 తర్వాత పది రోజులకు జరిగే మరో కథతో సెకండాఫ్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చాను.
ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమా కొత్తదనం అదే. బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు హైదరాబాద్‌లోనూ నాలుగు టెంపుల్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. నా తర్వాతి చిత్రం మారుతిగారి బ్యానర్‌లోనే ఉండొచ్చు’’ అన్నారు.