నిర్మాత మృతి.. చివరి రోజుల్లో ఇంత బాధ అనుభవించాడా? | Sakshi
Sakshi News home page

V.A. Durai: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్‌.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక..

Published Wed, Oct 4 2023 10:06 AM

Director Bala Cheated Producer V.A. Durai - Sakshi

సీనియర్‌ సినీ నిర్మాత వీఏ దురై (59) సోమవారం సాయంత్రం చైన్నెలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన 'పితామగన్' చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం 'శివపుత్రుడు' పేరుతో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాగా నటుడు సత్యరాజ్‌ కథానాయకుడిగా నటించిన 'ఎన్నమ్మా కన్ను' నిర్మాతగా ఈయన తొలి చిత్రం. ఆ తర్వాత కార్తీ కథానాయకుడిగా లూటీ, విజయకాంత్‌ హీరోగా గజేంద్ర.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అదే విధంగా రజనీకాంత్‌ బాబా సినిమాకు సైతం నిర్మాతగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే ఈయన భార్యా పిల్లలతో మనస్పర్థల కారణంగా చాలాకాలంగా వారికి దూరంగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తూ వచ్చారు. కొంతకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల ఒక కాలును కూడా తొలగించారు. వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవంటూ ఆ మధ్య ఈయన సామాజిక మాధ్యమాల్లో వీడియో రిలీజ్‌ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటుడు కరుణాస్‌, సూర్య వంటి కొందరు ఆర్థిక సాయం చేశారు.

తమిళం తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన పితామగన్‌ చిత్రం నిర్మాతకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు బాల మరో చిత్రం చేసి పెడతానని చెప్పి వీఏ దురై వద్ద రూ. 25 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. ఆయన దగ్గర సినిమా చేయలేదు సరి కదా తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై బాలను వీఏ దురై పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నిర్మాత వీఏ దురై సోమవారం రాత్రి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా వీఏ దురై భౌతికయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. హస్‌ గురించి చైతూ కామెంట్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement