ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఈ సామెతని అన్వయించుకుంటే.. సొంత భాషల్లో హిట్స్ కొట్టిన అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కానీ తమిళ హీరో ధనుష్ పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో వచ్చిన ఇతడి సినిమాలు, వాటి ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)
ధనుష్ పేరు చెప్పగానే ఆల్‌రౌండర్ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా విభిన్న బాధ్యతల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు. మధ్య పాటల రాసేస్తుంటాడు. కుదిరితే పాడేస్తుంటాడు కూడా. వీటి విషయంలో ఇతడిని వంక పెట్టడానికి ఏం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడి మూవీస్ చూస్తే మాత్రం పరభాషలో చేసినవన్నీ హిట్ అవుతున్నాయి. సొంత భాషలో చేసినవి మాత్రం అక్కడివరకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తుంది.
గత కొన్నేళ్లలో తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ధనుష్.. అణిచివేత గురయ్యే తరహా పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీంతో తమిళ ప్రేక్షకులకే ధనుష్ మూవీస్‌పై మొనాటనీ వచ్చేసింది. వేరే దర్శకులు తీస్తున్నా ధనుషే సొంత డైరెక్షన్ చేస్తున్నా కాన్సెప్ట్ దాదాపు ఇదే ఉంటోంది. ఈ తరహా చిత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెద్దగా ఆడట్లేదు. గత రెండేళ్లలో రిలీజైన రాయన్, ఇడ్లీ కొట్టు తరహా చిత్రాలతో పాటు గత వీకెండ్ రిలీజైన 'కర' మూవీలో ఇదే తరహా కాన్సెప్ట్స్ ఉండటం మైనస్ అవుతోంది. ఇవన్నీ తమిళంలో ఓ మాదిరిగా ఆడుతుంటే మిగతా చోట్ల మాత్రం దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.
మిగతా భాషల్లో మాత్రం ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సర్'లో టీచర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'లో బిచ్చగాడిగా మెప్పించాడు. గతేడాది చివరలో వచ్చిన హిందీ చిత్రం 'రే ఇష్క్ మై'లోనూ శ్రుతిమించే ఎమోషన్స్ ఉండే ప్రేమికుడిగానూ ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఎప్పుడో ఇంట గెలిచేసినా ధనుష్.. రీసెంట్ టైంలో మాత్రం సొంత భాషా సినిమాలతో హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అదే టైంలో తెలుగు, హిందీలో మాత్రం హిట్స్ కొడుతూ అదరగొట్టేస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


