
థియేటర్స్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఆ చిన్న సినిమానే చౌర్యపాఠం. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది.

ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.