
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ఆదివారం గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ సారి కూడా హోస్ట్గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు. మొత్తం 15 మంది హౌస్లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాక చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే..ఇప్పుడు హౌస్లోకి అడుగుపెట్టారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ట వర్మ, సంజనా గల్రానీ, ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్గా వెళ్లగా.. కామనర్స్గా మాస్క్ మెన్ హరీశ్, శ్రీజ, మర్యాద మనీష్, జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్బాస్ షో ప్రారంభం అయిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు ఏడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.
(చదవండి: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే.. హైలెట్స్ ఇవే)
‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ 9 సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ‘నీ నోటితో అన్నావ్గా..ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే’, ‘నాలుగు వారాల్లో వచ్చేస్తాడు’, ‘భరణిని గెలిపించాలని జనసైనిక్స్కి నాగబాబు టాస్క్ ఇచ్చాడు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు.
ఇక భరణి విషయానికొస్తే.. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు. గతకొంతకాలంగా అటు వెండితెరపై కానీ, ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావడం లేదు. బిగ్బాస్ 9 గుర్తింపు వస్తే.. అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్లోకి వెళ్లాడు. మరి భరణి ఎన్నిరోజులు హౌస్లో ఉంటాడో చూడాలి.