Live Updates

Bigg Boss 9 Telugu: కంటెస్టెంట్స్ వీళ్లే.. మొత్తం 15 మంది
బిగ్ బాస్ 9వ సీజన్.. హౌసులోకి వచ్చింది వీళ్లే
బిగ్‌బాస్ 9వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 15 మంది హౌసులోకి వెళ్లారు. సోషల్ మీడియాలో గత కొన్నిరోజుల నుంచి వినిపించినట్లుగానే ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ తదితర చోటా మోటా సెలబ్రిటీస్ హౌసులోకి వెళ్లారు. వీరితో పాటు అగ్నిపరీక్ష పోటీలో గెలిచి నిలబడిన 13 మందిలో ఆరుగురు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జవాన్ పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, డీమాన్ పవన్, మర్యాద మనీష్, శ్రీజ దమ్ము, ప్రియ ఉన్నారు. మరి రేపటి నుంచి వీళ్లందరూ ఎలాంటి గేమ్ ఆడుతారో చూడాలి?
పదిహేనో కంటెస్టెంట్‌గా మనీష్

అగ్నిపరీక్షలో పోటీ పడిన మర్యాద మనీష్.. బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇది నేరుగా జరగలేదు. స్టేజీపైకి వచ్చిన అగ్నిపరీక్ష యాంకర్ శ్రీముఖి.. తను ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఇవ్వాలని బిగ్‌బాస్‌ని కోరింది. కానీ హోస్ట్ నాగార్జున పర్మిషన్ ఇచ్చాడు. అలా శ్రీముఖి.. మనీష్‌ని ఎంపిక చేసింది. చివరలో వంట కోసం ఎవరిని ఎంపిక చేస్తావ్ అని ప్రియని నాగ్ అడగ్గా.. సంజన పేరు చెప్పింది. చివరలో ఔట్ హౌస్ గురించి చెప్పిన నాగార్జున.. అగ్నిపరీక్షలో గెలిచి వచ్చిన వాళ్లందరూ లోపల ఉంటారని, సెలబ్రిటీలు ఔట్ హౌసులో ఉంటారని నాగ్ చెప్పుకొచ్చాడు.
పద్నాలుగో కంటెస్టెంట్‌గా ప్రియ

ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ముందంజలో నిలిచిన ప్రియ.. బిగ్‌బాస్ హౌసులోకి పద్నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా డాక్టర్ కదా.. మరి బిగ్‌బాస్ ఎందుకు వెళ్తున్నావ్ అని నాగ్ అడగ్గా.. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఉండేదని కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో డ్రాప్ అయ్యాయని ప్రియ చెప్పింది. అయితే బిగ్‌బాస్ షో మొదలైనప్పటి నుంచి తన కుటుంబంతో కలిసి చూస్తున్నామని, అమ్మ చెబితేనే అగ్నిపరీక్ష కోసం అప్లై చేశానని ఇప్పుడు ఇలా ఇక్కడున్నానని చెప్పుకొచ్చింది.
పదమూడో కంటెస్టెంట్‌గా సుమన్ శెట్టి

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని పిచ్చి ఉండేది. ఓ మ్యాగజైన్‌లో చూసి సినిమా అవకాశం కోసం హైదరాబాద్ వెళ్లానని, అలా తేజ తీసిన 'జయం' సినిమాతో పరిచయమయ్యానని సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు. అలానే తన భార్య, కొడుకు, కూతురిని పరిచయం చేశాడు. తనకు తొలి అవకాశం తేజ ఇస్తే.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఛాన్స్ బిగ్‌బాస్‌తో వచ్చిందని, దీంతో ఎలా వదులుకుంటానని చెప్పుకొచ్చాడు. తన ఫేమస్ డైలాగ్స్ అన్నీ.. నాగార్జున అడిగాడని చెప్పేశాడు.
పన్నెండో కంటెస్టెంట్‌గా శ్రీజ దమ్ము

అగ్నిపరీక్ష పోటీలో జ్యూరీ మెంబర్ అయిన నవదీప్.. మరో సామాన్యుడిని హౌసులోకి పంపించేందుకు స్టేజీపైకి వచ్చాడు. అలా శ్రీజ ఫొటోని సెలెక్ట్ చేసి చూపించారు. ఈమెని ఎంపిక చేయడానికి గల కారణాన్ని నవదీప్ చెప్పాడు. అందరితో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం ఉందని, గేమ్స్‌లోనూ స్పీడ్ ఉండేదని అందుకే సెలెక్ట్ చేశామని చెప్పుకొచ్చారు. నిమిషం టైమ్ ఇస్తున్నా ఏమైనా ఆడియెన్స్‌తో చెప్పుకో అని నాగ్ అనగానే.. తను గెలుస్తానని, ఒకవేళ నామినేషన్స్‌లో ఉన్నాసరే తనని సేవ్ చేయాలని చెప్పుకొచ్చింది. హౌసులోకి వెళ్లిన వారంపాటు బట్టలు ఉతికే పని ఎవరికి అప్పజెబుతావ్ అని అడగ్గా.. రామ్ రాథోడ్ పేరు చెప్పింది.
పదకొండో కంటెస్టెంట్‌గా రాము రాథోడ్

'రాను బొంబాయికి రాను' పాటలో నర్తించి, పాడిన రాము రాథోడ్.. బిగ్‌బాస్ హౌసులోకి పదకొండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాక్‌డౌన్‌లో తన మ్యూజిక్ జర్నీ ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి సాధారణంగా పాడుతూ ఉండేవాడినని, ప్రత్యేకించి ఎలాంటి సంగీత శిక్షణ తీసుకోలేదని చెప్పాడు. మన పాటలో మనమే ఎందుకు డ్యాన్స్ చేయకూడదు అని ఇలా ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నానని అన్నాడు. చివరలో నాగార్జున గురించి కూడా ఓ పాట పాడిన రాము.. ఆశ్చర్యపరిచాడు.
పదో కంటెస్టెంట్‌గా సంజనా గల్రానీ

ఈమె అసలు పేరు అర్చన. 7వ క్లాసులోనే మోడలింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరీ జగన్నాథ్.. తనకు బుజ్జిగాడు సినిమాలో అవకాశం ఇచ్చారు. అంతా సవ్యంగా సాగుతున్న టైంలో నా పేరు ఓ కేసు ఇరికించారు. కేవలం విచారణ కోసం రమ్మని పిలిచి అరెస్ట్ చేశారు. ఈ కేసులో హైకోర్ట్ నుంచి క్లీన్ చిట్ వచ్చినప్పటికీ అందరికీ ఈ విషయం తెలియలేదని చెప్పుకొచ్చింది. దీంతో తాను కేసుల‍్లో ఇరుక్కున్న అమ్మాయిని కాదని నిరూపించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చింది.
తొమ్మిదో కంటెస్టెంట్‌గా డీమాన్ పవన్

అసలు డీమాన్ అని ఎందుకు పెట్టుకున్నావ్ అని నాగార్జున అడగ్గా.. జపనీస్ నవల్స్ చదువుతాను, అందులో డీమాన్ అనే పాత్ర చూసి తన పేరుకు ముందు దాన్ని తగిలించుకున్నానని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు వేసిన పోల్స్ బట్టి ఇతడిని ఎంపిక చేశారు.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా రీతూ చౌదరి

పలు తెలుగు సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుల్ పాపులర్. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతోంది. అయితే ఈమె అసలు పేరు దివ్య. ఇలానే నాగ్ పిలవగా.. వద్దు సర్ ఈ పేరుతో పిలవొద్దు అని చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది. స్కూల్ టైంలో తనతో పాటు క్లాసులో పదిమందికి దివ్య అనే పేరు ఉండేదని, దీంతో పేరు మార్చుకోవాలని ఫిక్స్ అయి రీతూ అని పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. లోపల ఏదైతే ఉందో అదే మాట్లాడేస్తానని తెలిపింది.
ఏడో కంటెస్టెంట్‌గా నటుడు భరణి

అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్‌తో ఫేమస్ అయిన నటుడు భరణి.. పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో ఈయన చేసిన వాటిలో ఉన్నాయి. అయితే స్టేజీపైకి వస్తూ ఓ సీక్రెట్ బాక్స్ పట్టుకొచ్చిన ఇతడు.. దీన్ని కూడా హౌసులోకి తీసుకెళ్తానని అన్నాడు. బిగ్‌బాస్ మాత్రం అందులో ఏముందో చెప్పాలని అడగ్గా భరణి లేదని తేల్చేశాడు. దీంతో తిరిగి బయటకెళ్లిపోవాలని అన్నారు. దీంతో భరణి.. వచ్చిన దారిలోనే వెళ్లిపోయినట్లు చూపించారు. కానీ కాసేపటి తర్వాత దయతలచిన బిగ్‌బాస్.. తిరిగి భరణిని లోపలికి పంపించాడు. అంతకంటే ముందు కామనర్స్‌లోని పవన్ అనే కుర్రాడితో 50 బస్కీలు తీయాలని భరణికి పోటీ పెట్టగా అందులో గెలిచేశాడు.
ఆరో కంటెస్టెంట్‌గా మాస్క్ మ్యాన్ హరీశ్

హౌసులోకి వెళ్లబోయే రెండో సామాన్యుడిగా మాస్క్ మ్యాన్ హరీశ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నాగ్ సమక్షంలో జ్యూరీ మెంబర్ బిందుమాధవి రివీల్ చేసింది. అయితే హౌసులోకి వెళ్లడం ఎలా అనిపిస్తుంది అనగానే... తన కల నెరవేరినట్లు అనిపిస్తుందని హరీశ్ చెప్పుకొచ్చాడు. హౌస్ అంతా ఓ వారం క్లీన్ చేసే వర్క్.. ఇమ్మాన్యుయేల్-శ్రష్ఠి వర్మలో ఎవరికి ఇస్తే బాగుంటుందో చెప్పాలని నాగ్.. హరీశ్‌ని అడిగారు. దీంతో హరీశ్.. ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు.
ఐదో కంటెస్టెంట్‌గా శ్రష్ఠి వర్మ

ఢీ షోతో పరిచయమైన శ్రష్ఠి వర్మ.. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. అయితే జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని కొన్నాళ్ల క్రితం ఈమె పోలీసు కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 'పుష్ప 2' చిత్రానికి ఈమె కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది. శర్వానంద్, అల్లు అర్జున్‌కి కొరియోగ్రఫీ చేశానని చెప్పింది.
నాలుగో కంటెస్టెంట్‌గా ఇమ్మాన్యుయేల్

పలు కామెడీ షోలతో ఫేమస్ అయిన ఇమ్మాన‍్యుయేల్.. విరూపాక్ష, గంగం గణేశా, కొరమీను తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌసులోకి వచ్చాడు. 'అమ్మ అమ్మ' అంటూ మగ ఆడ గొంతుల్లో పాట పాడి ఆశ్చర్యపరిచాడు. మరి ఇలా అమ్మాయిలా ఎవరితోనైనా మాట్లాడావా? అని నాగ్ అడగ్గానే.. కాలేజీ రోజుల్లో ఓ ఫ్రెండ్‌ని ఆటపట్టించానని.. తర్వాత నిజం తెలిసి అతడు తను తిట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక స్క్రీన్‌పై కొందరు సెలబ్రిటీలు ఫొటోలు చూపించగా.. వాళ్లలా మిమిక్రీ చేసి చూపించాడు.
మూడో కంటెస్టెంట్‌గా పవన్ కల్యాణ్

అగ్నిపరీక్షలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. స్వతహాగా ఆర్మీ జవాన్. అయితే పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ఇతడు.. ప్రేక్షకాదరణ కూడా దక్కించుకుని తొలి సామాన్యుడిగా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు.
రెండో కంటెస్టెంట్‌గా ఫ్లోరా సైనీ

అప్పట్లో 'లక్స్ పాప' పాటతో ఫేమస్ అయిన ఆశా సైనీ తర్వాత కాలంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'ఆ ఇంట్లో వంటి' చిత్రాల్లోనూ నటించింది. చాన్నాళ్లకు వెండితెరకు దూరంగానే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చేసింది. తొలి మూవీ చేసేటప్పుడు తనకు తెలియకుండా ఆశా సైనీ అని పెట్టేశారని, కానీ తన అసలు పేరు ఫ్లోరా సైనీ అని చెప్పకొచ్చింది. అయితే 'ప్రేమ కోసం' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా 100కి పైగా సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది. అందరు అమ్మాయిల్లానే తాను ప్రేమించానని, కానీ చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది.
తొలి కంటెస్టెంట్‌గా తనూజ

తొలి పోటీదారుగా కన్నడ నటి తనూజ.. హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో సినిమా నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగులో 'ముద్దముందారం' సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. తన గురించి తొమ్మిది మాటల్లో చెప్పమనగానే అందంగా ఉంటాను, వంట చేస్తాను, ఫ్యామిలీ గర్ల్, అమయాకురాలిని అని కొన్ని పాయింట్స్ చెప్పింది. అలానే నాగార్జున కోసం మటన్ బిర్యానీ వండి తీసుకొచ్చింది. అలానే హౌసులోకి వచ్చిన విషయం నాన్నకు కూడా తెలియదని చెప్పుకొచ్చింది.

హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జున.. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు. అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న టాప్-13 అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌ని పలకరించారు. వీళ్లలో ఐదుగురు మాత్రమే హౌసులోకి వెళ్తారని చెప్పుకొచ్చారు. అలానే అగ్నిపరీక్ష పోటీ మొత్తాన్ని ఏవీగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. అనంతరం అందరితోనూ నాగ్ మాట్లాడారు.
గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున

ఇక గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. సోనియా సోనియా పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. అలానే సామాన్యులు ఓవైపు, సెలబ్రిటీలు మరోవైపు ఉండి పోటీ పడతారని నాగ్ చెప్పుకొచ్చారు. ఎప్పటిలా నేరుగా హౌసులోకి హౌస్ట్ నాగార్జునని బిగ్‌బాస్ వెళ్లనివ్వలేదు. కళ్లకు గంతలు కట్టి పంపించారు.

బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలైపోయింది. ఇప్పటివరకు 8 సీజన్లు కాగా.. ఇప్పుడు 9వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి సామాన్యుల కోసం అగ్నిపరీక్ష పేరుతో పోటీలు నిర్వహించారు. అందులో గెలిచిన కొందరు కూడా ఈసారి కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టబోతున్నారు.