
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ పదిహేను సినిమాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ‘జస్టిస్ ధర్మ’ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించనుండగా, ‘నాగపంచమి’కి ఓం సాయిప్రకాశ్, ‘నా పేరు పవన్ కల్యాణ్’కి జేకే భారవి, ‘టాపర్’కి ఉదయ్ భాస్కర్, ‘కేపీహెచ్‌బీ కాలనీ’కి తల్లాడ సాయికృష్ణ, ‘పోలీస్ సింహం’కి సంగకుమార్, ‘అవంతిక–2’కి శ్రీరాజ్ బళ్లా, ‘యండమూరి కథలు’కి రవి బసర, ‘బి.సి’ (బ్లాక్ కమాండో)కి మోహన్ కాంత్, ‘హనీ కిడ్స్’కి హర్ష, ‘సావాసం’కి ఏకరి సత్యనారాయణ, ‘డార్క్ స్టోరీస్’కి కృష్ణ కార్తీక్, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’కి బి. శ్రీనివాసరావు, ‘ది ఫైనల్ కాల్’కి ప్రణయ్ రాజ్ వంగరి, ‘అవతారం’ సినిమాకి డా. సతీష్ దర్శకత్వం వహించనున్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలను 2026 ఆగస్టు 15కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్‌లో నమోదు చేశాయి’’ అని చెప్పారు.