
'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. ఈ సినిమా ఓరిజినల్ కాపీ అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతుంది. అలాంటప్పుడు రీమేక్ భైరవం కోసం జనాలు థియేటర్‌కు వస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల నోటిదురుసు వల్ల బాయ్‌కాట్ భైరవం (#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒకవైపు వైఎస్సార్‌సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు.
తమిళ సినిమా 'గరుడన్'కు రీమేక్‌గా 'భైరవం' సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. గతేడాదిలో తమిళ్‌లో మాత్రమే విడుదలైన గరుడన్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.తమిళ నటుడు సూరి లీడ్ రోల్లో నటించగా అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాను ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. వెట్రిమారన్ కథ అందించాడు.

భైరవంలో కూడా ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. గరుడన్ కథ నచ్చే తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలని భైరవం తీస్తున్నట్లు దర్శకుడు విజయ్ కనకమేడల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, మాతృకతో పోలిస్తే మన ప్రేక్షకులకు నచ్చేలా అవసరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకి కూడా కొత్త అనుభూతిని అందించేలా ఈ కథలో మార్పులు చేసినట్లు ఆయన అన్నారు.