Beast Movie Review: విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ ఎలా ఉందంటే..

Beast Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : బీస్ట్‌
జానర్ : యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : విజయ్‌, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్‌ , విటివి గణేశ్‌, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థ : సన్‌ పిక్చర్స్‌
నిర్మాత: కళానిధి మారన్‌
దర్శకత్వం : నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌
సంగీతం : అనిరుధ్‌ 
ఎడిటింగ్‌: ఆర్‌.నిర్మల్‌
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
విడుదల తేది : ఏప్రిల్‌  13, 2022

విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. వైవిధ్యం కచ్చితంగా ఉంటుందని సినీ అభిమానులు అంచనా వేస్తారు. అందుకు తగ్గట్టే.. విజయ్‌ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పేరుకు కోలీవుడ్‌ హీరో అయినా.. ఆయన ప్రతి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి మార్కెటింగ్‌ సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘బీస్ట్‌’ కూడా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా భారీ స్థాయిలో నేడు(ఏప్రిల్‌ 13) విడుదలైంది. ‘కోలమావు కోకిల`, `డాక్టర్‌` చిత్రాలతో కోలీవుడ్‌లో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్‌.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో ‘భీస్ట్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేయడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘బీస్ట్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం.

‘బీస్ట్‌’ కథేంటంటే..
వీర రాఘవన్‌ అలియాస్‌ వీర(విజయ్‌) భారత ‘రా’ ఏజెంట్‌. ఏ సీక్రెట్‌ ఆపరేషన్‌ని అయినా ఈజీగా చేసే సత్తా ఉన్నోడు. ఓ సారి రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉగ్రవాదుల అధినేత ఉమర్‌ ఫరూఖ్‌ని పట్టుకునేందుకు ఓ ఆపరేషన్‌ చేపడతాడు. అది విజయవంతం అయినప్పటికీ.. చిన్న పొరపాటు కారణంగా ఓ చిన్నారి మృతి చెందుతుంది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన వీర.. వృత్తిని వదిలేసి చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడ అనుకోకుండా ప్రీతి(పూజాహెగ్డే)తో పరిచయం ఏర్పడుతుంది. ఓ సారి ఆమెతో కలిసి చెన్నైలోని ఈస్ట్‌ కోస్ట్‌ మాల్‌కి వెళ్తాడు. అదే సమయంలో ఆ మాల్‌ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు. తమ లీడర్‌ ఉమర్‌ ఫరూఖ్‌ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తారు. ఆ సమయంలో ఉమర్ ఫరూఖ్‌ని పట్టుకున్న రా ఏజెంట్‌ వీర ఏం చేశాడు? ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ రాఘవన్)తో వీర కుదుర్చుకున్న డీల్‌ ఏంటి? టెర్రరిస్టుల హైజాక్‌కి కేంద్ర హోంశాఖ మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని వీర ఎలా బయటపెట్టాడు? చివరకు టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న 150 మంది ప్రజలను ఒక్కడే ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే...
దాదాపు 190 కోట్ల రూపాయల బడ్జెట్‌, విజయ్‌ లాంటి స్టార్‌ హీరో, పూజా హెగ్డే లాంటి బ్యూటిఫుల్‌ హీరోయిన్‌.. నెంబర్‌ వన్‌ టెక్నీషియన్స్‌ ..ఇలాంటి టీమ్‌ దొరికితే  ఏ దర్శకుడైనా కథను ఓ రేంజ్‌లో సమకూర్చుకుంటాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ మాత్రం చాలా సింపుల్‌, రొటీన్‌ స్టోరీని ఎంచుకోవడం నిజంగా విచిత్రమే.  ఓ షాపింగ్‌ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు? ఇదే బీస్ట్‌ కథ. ఇంతకు మించి కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. సినిమా అంతా మాల్‌ చుట్టే తిరుగుతుంది. విజయ్‌ది వన్‌మ్యాన్‌ షో. పోనీ అతని ప్రత్యర్థులు అంటే ఉగ్రవాదులు అయినా క్రూరంగా వ్యవహరిస్తారా? అంటే అదీ లేదు. తమ సభ్యులు చనిపోతుంటే కూడా ప్రజలకు ఎలాంటి హానీ కలిగించకపోవడం మరో విచిత్రం.

విజయ్‌ ఒక్కడితోనే యాక్షన్‌ సీన్స్‌ చేయిస్తే చాలు.. ప్రత్యర్థులు ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడేమో దర్శకుడు. పైగా సీరియస్‌ సిచ్యుయేషన్‌లో కామెడీ సీన్స్‌ చొప్పించాడు. అది అక్కడక్కడ వర్కౌట్‌ అయినా.. కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ సీన్‌ కూడా అంతగా ఆసక్తిగా అనిపించదు. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే కనిపెట్టగలడు. క్లైమాక్స్ కూడా చాలా రోటీన్‌. సినిమాలో హీరో కొట్టే ఒకే ఒక్క డైలాగ్‌ ఏంటంటే..‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్తదేమి కాదు. పోకిరిలో మహేశ్‌ బాబు నోట ఆ డైలాగ్‌ ఎప్పుడో విన్నారు. ఇప్పుడు విజయ్‌ చెప్తే అంతగా.. ఇంప్రెస్‌ కాలేరు. ఇక ఈ సినిమాలో లాజిక్‌ల జోలికి అసలే వెళ్లొద్దు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో మాజీ రా ఏజెంట్‌ అయిన హీరో పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ ఉగ్రవాదులపై దాడి చేసి, ఉమర్‌ ఫరూఖ్‌ని తీసుకురావడం.. ఏ యాంగిల్‌లో ఆలోచించినా.. లాజిక్‌ కనిపించదు. ప్రతి సీన్‌లో విజయ్‌ స్టైలిష్‌గా కనిపించడం, యాక్షన్‌ సీన్‌లో చెలరేగిపోవడం సినిమాకు కలిసొచ్చింది. అలాగే సెల్వరాఘవన్‌ విటివి గణేశ్‌ బేస్‌ వాయిస్‌తో చెప్పే పంచ్‌లు డైలాగులు, కామెడీ కొంతమేర ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
రా ఏజెంట్‌ వీర రాఘవన్‌ పాత్రలో విజయ్‌ ఒదిగిపోయాడు. యాక్షన్స్‌ సీన్స్‌లో అయితే చెలరేగిపోయాడు. తెరపై చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. తనను తెరపై ఎలా చూస్తే అభిమానులు ఆనందపడతారో అలానే కనిపించాడు. 'అరబిక్‌ కుత్తు’ పాటలో డ్యాన్స్‌ ఇరగదీశాడు. ప్రీతిగా పూజా హెగ్డే పర్వాలేదు. అయితే ఆమె పాత్రకు కొంచెం కూడా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ఏదో ఉందా ..అంటే ఉంది అన్నట్లుగా తెరపై అలా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్‌గా సెల్వ రాఘవన్‌ మంచి నటనను కనబరిచాడు. ఆయన వేసే సెటైరికల్‌ పంచ్‌లు నవ్వులు పూయిస్తాయి. విటివి గణేశ్‌ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ మూవీకి ప్రధాన బలం అనిరుధ్‌ సంగీతం. ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్స్‌లో ఈ సాంగ్‌ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్‌.నిర్మల్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top