సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్‌లో అన్ని పాటలు పాడటం రెహమాన్‌కు ఇదే మొదటిసారి!
అది రిపీట్ అవాలని..
ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు.
రెండు వారాల రిహార్సల్స్
ఇందులో సంగీతానికి, డ్యాన్స్‌కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.
చదవండి: అప్పుడే తెలిసిపోయింది


