Ante Sundaraniki Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki Review: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ

Published Fri, Jun 10 2022 12:51 PM

Ante Sundaraniki Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : అంటే..సుందరానికీ
నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి తదితరులు
నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు:నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. 
దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ
సంగీతం : వివేక్‌ సాగర్‌ 
సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి
ఎడిటర్‌ :రవితేజ గిరిజాల
విడుదల తేది : జూన్‌ 10,2022

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్‌ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్‌ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్‌ 10) విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

 

కథేంటంటే
సుందర్‌(నాని)..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి(నరేశ్‌) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే పద్దతిగా పెంచాలనుకుంటాడు. సుందర్‌ చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)ని సంప్రదిస్తుంది అతని ఫ్యామిలీ.

అప్పటి నుంచి సుందర్‌ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగారావు ఈ దోషం, ఆ దోషం అంటూ సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్‌ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్‌(నజ్రియా నజీమ్‌) ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి(అలగం పెరుమాల్‌) హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్‌, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్‌, లీలాలు చెప్పిన ఆబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్‌, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అంటే సుందరానికీ’సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.‘అంటే సుందరానికీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..అయితే పాత కథకు కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, కాస్త కామెడీగా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. పద్దతులు ఆచారాల ముసుగులో లోపలి మనిషిని చంపుకోవద్దు. మతం కంటే మానవత్వం గొప్పదనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ ఓ అందమైన లవ్‌స్టోరీని చూపించాలనుకున్నాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు. ‍ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా..కంప్లీట్‌ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించినా.. కథనం మాత్రం సాదాసీదాగా సాగుతుంది.

ఫస్టాప్‌లో బ్రాహ్మణ కుర్రాడు సుందర్‌ బాల్యంలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు  తప్పా మిగతావేవి అంతగా ఫన్‌ని క్రియేట్‌ చేయలేదు. హీరోయిన్‌ని పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. దీనికి తోడు హీరో కంటే ముందే ఆమెకు మరో లవ్‌ స్టోరిని యాడ్‌ చేసి ఫస్టాఫ్‌ అంతా సాగదీశాడనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సుందర్‌, లీలా ఇద్దరు అమెరికాకు వెళ్లడం.. పెళ్లి కోసం అబద్దం చెప్పి ఇండియాకు రావడంతో అసలు స్టోరీ ముందుకు సాగుతుంది. వీరిద్దరు చెప్పిన అబద్దాలే నిజంగా జరగడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చిన కామెడీ సీన్స్‌ కూడా బాగున్నాయి. క్లైమాక్స్‌లో ‘ప్రెగ్నేన్సీ అనేది చాయిస్‌ మాత్రమే కానీ. ఆప్షన్‌ కాదు’ అని హీరో చెప్పే డైలాగ్‌ హృదయాలను హత్తుకుంటుంది.  దాదాపు మూడు గంటల నిడివి ఉండడం సినిమాకు మైనస్‌. మొత్తంగా అబద్దాలతో కాసేపు నవ్వించి.. చివర్లో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్స్‌ నుంచి బయటకు పంపాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే..
యాక్షన్‌ అయినా.. కామెడీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు నాని. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా అంతే.. సుందర్‌ ప్రసాద్‌ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. లీలా థామస్‌గా నజ్రియా ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమా అయినా.. చాలా బాగా నటించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. సుందర్‌ తండ్రిగా నరేశ్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు.

ఇక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా రోహిణి తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్‌ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ.. ఆమె పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది. సుందర్‌ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ మెరిసింది. ఇక సుందర్‌ బాస్‌గా హర్షవర్ధన్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

 ఇక సాంకేతిక విషయానికొస్తే.. వివేక్‌ సాగర్‌ సంగీతం పర్వాలేదు. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా  ఉంది. నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్‌ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement