‘అలా చేసి సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తా, మద్దతు ఇవ్వండి’

Anchor Vindhya Medapati To auction Her Outfits Amid COVID 19 Crisis - Sakshi

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో దాదాపుగా సమయానికి వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత వల్ల వైద్య సదుపాయాలు అందక ఎంతోమంది తమ సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు.

అలాంటి సంఘటనలు చూసి చలించిన నటుడు సోనూసూద్‌ కోవిడ్‌ బాధితుల కోసం సొంతంగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోవిడ్‌ బాధితులకు మందులు, ఆక్సిజన్‌ పంపిణి చేస్తూ సమయానికి ఆదుకుంటున్నారు. దీంతో ఆయన ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. తాజాగా యాంకర్‌, ఐపీఎల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు హోస్ట్‌ వింధ్య సైతం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసింది.

ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తన సహా నటీనటులకు ఆమె విజ్ఞప్తి చేసింది. విషయం తెలుసుకున్న యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ వింధ్యను ప్రశంసలతో ముంచెత్తింది. ‘ఇది నిజంగా అద్బుతమైన ఆలోచన. నేను కూడా చేస్తాను. నీ వీడియోతో నాలో స్ఫూర్తిని నింపినందుకు థ్యాంక్స్‌ వింధ్య’ అంటు పోస్టు షేర్‌ చేసింది. అది చూసి వింధ్య.. ‘థ్యాంక్యూ అనూ నీ నుంచి ఇది ఊహించలేదు’ అంటూ ఆమె మురిసిపోయింది. కాగా, వింధ్య స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగుతో పాటు పలు కార్యాక్రమాలకు, టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్‌ యాంకరింగ్‌ కోసం హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె కోవిడ్‌ కారణంగా ఈ సీజన్‌ వాయిదా పడటంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top