
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).
ఎందుకీ సినిమా చేశావ్?
తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.
అది ముగిసిన చాప్టర్
మణిరత్నం సర్ విజన్‌ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్‌లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.
థగ్ లైఫ్
మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్‌లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో!