పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే | After Wedding Samantha And Rashmika Will Success | Sakshi
Sakshi News home page

Samantha Rashmika: స్టార్ హీరోయిన్ల సామ్-రష్మికకు అదే పెద్ద పరీక్ష?

Jun 16 2026 8:42 PM | Updated on Jun 16 2026 8:42 PM

After Wedding Samantha And Rashmika Will Success

సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?

(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)

సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్‌డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్‌గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.

ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్‌లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్‌కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?

రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్‌టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement