
‘కాలేజీ చదివే రోజుల్లో అల్లరిచిల్లరగా తిరిగా.. ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు.. రోడ్డు ప్రమాదంలో మా అన్నను కోల్పోయిన తర్వాతే రహదారి భద్రతకు ఉండే ప్రాధాన్యత అర్థమైంది’ అని సినీ నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. అప్పటి నుంచి బాధ్యతగా వాహనాన్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జలవిహార్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్–2025 ముగింపు వేడుకలు. వీటికి కిరణ్ అబ్బవరం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
‘డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా చెబుతుంటే.. సోది అనుకునేవాడిని.. ఓ రోజు సాయంత్రం మా అన్నతో చాలాసేపు గడిపా.. పల్లెలో ఇల్లు కట్టుకోవాలని, అది అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ చర్చించుకున్నాం. ఇది జరిగిన గంటకే అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త వినాల్సి వచి్చంది. అప్పటి నుంచి నాకూ భయం పట్టుకుంది. అప్పటి వరకూ కారు ఎక్కితే చాలు దూసుకుపోవాలని, గంటకు 140 కిలోమీటర్ల స్పీడ్ టచ్ కావాలని భావించే వాడిని. బంజారాహిల్స్‌లో చెకింగ్స్ జరుగుతున్నాయని తెలిస్తే జూబ్లీహిల్స్ మీద నుంచి దూసుకుపోయేవాడిని’ అన్నారు.

‘ఇప్పుడు ప్రతిక్షణం అప్రమత్తంగా డ్రైవ్ చేస్తున్నా. మనం బతకాలి, ఎదుటి వారిని బతికించాలి అనే ఉద్దేశంతో పూర్తి బాధ్యతగా డ్రైవింగ్ చేస్తున్నా. అన్న ఉదంతం తర్వాతే ఏదైనా ప్రమాదంలో ఓ ప్రాణం ఆ కుటుంబానికి ఎంత అవసరమో తెలిసింది. ఎవరైనా చెప్తే ఆ విషయం మన మనసులో ఎక్కువ కాలం ఉండదు. అదే మన మనసులో మెదిలితే మాత్రం సుదీర్ఘకాలం ఉండిపోతుంది. అందుకే ట్రాఫిక్ రూల్స్ విషయంలో అందరం మనస్ఫూర్తిగా మారదాం. నేటి తరం యువకు నేను చెప్తున్నది ఒక్కటే.. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ కచ్చితంగా ధరించండి. మీతో పాటు ఎదుటి వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని నడపండి. ఇంటి నుంచి వాహనం బయటకు తీసిన క్షణం నుంచే దీన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా మెలగాలి’ అని పిలుపునిచ్చారు.