‘‘నేను హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ నాకు తెలుగు సినిమాలు, తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. రామ్‌చరణ్‌గారి ‘ఆరెంజ్’ చిత్రం చూశాను. అప్పట్నుంచి తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నాను. ఇండియన్ సినిమాకి తెలుగు పరిశ్రమ గొప్ప చిత్రాలను అందించింది. తెలుగులో సినిమా చేయాలనే నా కల ‘జటాధర’ సినిమాతో నెరవేరడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే చిత్రం ఇది’’ అని చెప్పారు నిర్మాత ప్రేరణ అరోరా. సుధీర్‌బాబు, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’.
ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేరణ అరోరా మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అంశాలు, ఎమోషన్స్, మైథలాజికల్, సూపర్ నేచురల్ విషయాలు, ఆశ, అత్యాశ... ఇలా అన్ని అంశాలు ‘జటాధర’లో చక్కగా కుదిరాయి.
సుధీర్‌గారు చేసిన క్యారెక్టర్, ఆయన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయి. సోనాక్షీ సిన్హాగారు చేసిన ధన పిశాచి క్యారెక్టర్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్రకు సోనాక్షినే పర్ఫెక్ట్ చాయిస్. సుధీర్‌బాబు–సోనాక్షిల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అలరిస్తాయి. శిల్పాగారి క్యారెక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, నాగబంధం, పిశాచి బంధం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను చూపించాం. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండే స్కోప్ ఉంది. తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేయనున్నాం’’ అని చెప్పారు.


