కోలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan ). అంతేకాకుండా ఇటీవల అయిలాన్, మావిరన్,అమరన్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ ప్రతినాయకుడుగాను అధర్వ ముఖ్యపాత్రలోనూ నటిస్తుండగా, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 జనవరిలో పొంగల్ రేస్‌కు సిద్ధమవుతోంది.

దీంతో శివకార్తికేయన్ తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో నటించిన ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో శివ కార్తికేయన్ గౌరవ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో రూపొందనున్న చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో సాగుతుందని సమాచారం. శివ కార్తికేయన్ చివరి చిత్రం మదరాసి అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. అదే విధంగా వెంకట్ ప్రభు చిత్రం గోట్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటించనున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల మలయాళంలో నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం 'కొత్త లోక' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కల్యాణి ప్రియదర్శన్ ఇంతకుముందే హీరో అనే చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ జంట మళ్లీ రిపీట్ కానున్నదన్నమాట.


