జిల్లా వ్యాప్తంగా పలు రకాల పింఛన్లు 1.5 లక్షలపైచిలుకున్నాయి. వీరికి ప్రతినెలా రూ.24 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, గత 2022లో ఆఖరిసారి పింఛన్ల పథకం మంజూరు చేయగా ఇప్పటికి నాలుగేళ్లవుతున్నా, కొత్త పింఛన్లు మంజూరు చేయటంలేదు. ఈ ఏడాది దసరాకు కొత్తపింఛన్లు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించి అర్హులైన వారినుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా జిల్లావ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా 12,357 మంది దరఖాస్తులు చేసుకోగా, ఆఫ్లైన్ ద్వారా 175 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 12,532 మంది లబ్ధిదారులు నూతన పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో వితంతు, ఒంటరి, దివ్యాంగులు, పైలేరియా, బోదకాలు, చేనేత, గీత కార్మికులు కలిపి మొత్తం 7 రకాల పింఛన్ దారులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారికి ఎప్పటి నుంచి పింఛన్లు మంజూరు చేస్తారనేది తెలియడంలేదు.
వృద్ధాప్య పింఛన్కు నోఛాన్స్!
నాలుగేళ్ల నుంచి కొత్తవారికి పింఛన్లు ఇవ్వకపోగా ప్రస్తుతం ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నెలరోజులపాటు పింఛన్లకు అర్హులైన కొత్తవారు దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో వృద్ధాప్య పింఛన్దారులకు అవకాశం ఇవ్వకపోవటంతో ఎంతోమంది వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో 2022లో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. నాలుగేళ్ల కాలంలో 57 ఏళ్లు నిండిన వారు 15 వేలపైచిలుకు మంది ఉన్నట్లు తెలిసింది. వారందరూ తాము దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వక పోవటం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందుతున్నారు.
నాలుగేళ్లుగా ఆసరా, కొత్త పింఛన్ల మంజూరు లేక అర్హులైన ఎంతోమంది లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటంలేదు. అర్హులందరికీ దసరా నుంచి ఆసరా పింఛన్లు ఇస్తామంటూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నెలరోజుల పాటూ ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఇవ్వగా జిల్లాలో 12 వేల పైచిలుకుమంది దరఖాస్తులు చేసుకోగా, వృద్ధాప్య పింఛన్కు అవకాశం ఇవ్వకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు దారులకు సైతం పింఛను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనేది స్పష్టతలేదు.
– మెదక్జోన్
తమకెలాంటి ఆదేశాలు రాలేదు!
జిల్లాలో కొత్తగా 12,532 మంది కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్దారులకు అవకాశం లేదు. కాగా, నూతన దరఖాస్తుదారులకు ఎప్పటి నుంచి పింఛన్లు మంజూరవుతాయనే విషయంపై మాకు సమాచారం లేదు.
–భీమయ్య, డీపీఎం
దసరా పండక్కి లేనట్టే...!
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 12,532
వృద్ధాప్య పింఛన్లకు నో అప్లికేషన్
నాలుగేళ్లుగా తప్పని ఎదురుచూపులు


