ఎఫ్‌టీలకు గ్రాట్యుటీ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌టీలకు గ్రాట్యుటీ

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేస్తున్న వీబీజీరాంజీ ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయిస్‌(ఎఫ్‌టీఈ)లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. ఈ సమస్యకు ముగింపు పలుకుతూ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలు వర్తింపజేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఇటీవలే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృధ్దిశాఖ జీఓ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులకు, జిల్లాలో పనిచేస్తున్న 112 మంది ఉద్యోగులకు పదవీవిరమణ సమయంలో ఆర్థిక భరోసా లభించనుంది. గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎస్‌ఆర్‌డీఎస్‌) పరిధిలో పనిచేస్తున్న అర్హులైన ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలు లభించనున్నాయి. గతంలో సెర్ప్‌ పరిధిలోని ఎఫ్‌టీఈలకు అందుతున్న ప్రయోజనాలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

జిల్లావ్యాప్తంగా 112 మంది ఉద్యోగులు

జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో వీబీజీ రాంజీలో 112 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 14 మంది ఏపీఓ(అడిషనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌)లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు 58 మంది, ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ, జీఈ సివిల్‌ 9 మంది, అడిషనల్‌ డీఆర్‌పీ 1, ఏపీడీ 1, హెచ్‌ఆర్‌ 1, ప్లాంటేషన్‌ మేనేజర్‌లు 1, కంప్యూటర్‌ ఆపరేటర్లు 27 మంది పనిచేస్తున్నారు.

ఎఫ్‌టీఈ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం

వీబీజీరాంజీలో పనిచేస్తున్న ఎఫ్‌టీఈలకు రిటైర్మెంట్‌ సమయంలో రూ.4 లక్షల గ్రాట్యుటీ, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి సుమారు రూ.16 లక్షల మేర ప్రయోజనం చేకూరనుంది. ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా లేదా అర్హత కలిగిన బీమా సంస్థల ద్వారా గ్రూప్‌ గ్రాట్యుటీ, గ్రాట్యుటీ ఫండ్‌ ఏర్పాటు చేయాలని జీఓలో వివరించారు. దీనీ కోసం నెలకు రూ.1 కోటి వరకు ఆర్థిక వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వర్తిస్తున్న ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా, చట్టపరమైన నిబంధనలకు లోబడి అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవానికి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో వీబీజీరాంజీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలపై వీబీజీరాంజీ ఉద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పలు సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 112 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా

సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement