పాపన్నపేట(మెదక్): దేవీశరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడుపాయల వన దుర్గమ్మ భక్తులకు శ్రీమహాచండీ అలంకారంతో దర్శనమిచ్చారు. అర్చకులు శంకరశర్మ,పార్థివశర్మ అమ్మవారిని ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించారు. గోకుల్ షెడ్డులో ఉత్సవ విగ్రహానికి ఉదయం, సాయంత్రం వేద బ్రహ్మణులు పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఈఓ వీరేశం ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఏడుపాయల్లో బోనాలు తీయనున్నట్లు ఈఓ తెలిపారు.
నర్సాపూర్: నర్సాపూర్లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీమాత బుధవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజలలో భాగంగా శ్రీ అన్నపూర్ణ మాతగా అలంకరించి పూజలు చేశారు.


