కల్లు తేలేస్తుండ్రు | - | Sakshi
Sakshi News home page

కల్లు తేలేస్తుండ్రు

Jun 27 2026 7:30 AM | Updated on Jun 27 2026 7:30 AM

జిల్లాలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు

మత్తులో చిత్తవుతున్న బతుకులు

మానేసిన వారిలో వింత ప్రవర్తన

చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ

మెదక్‌జోన్‌: మెతుకుసీమలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. కొందరు స్వచ్ఛమైన కల్లు మాటున గరళం అమ్ముతున్నారు. రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలు కలిపి అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో 492 గ్రామాలుండగా, పట్టణం నుంచి పల్లె వరకు 500 పైగా కల్లు దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అనుమతి లేనివి సైతం ఉన్నట్లు తెలిసింది. రోజంతా కష్టం చేసే పల్లె ప్రజలు సాయంత్రం ఇంటికి రాగానే కల్లు తాగి సేదతీరుతారు. అదే కాలకూట విషంగా మారుతోంది. కల్లులో క్లోరోఫాం, డైజోఫాం లాంటి నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నారు. అది సేవించిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆ కల్లుకు అలవాటు పడిన జనం తాగకుండా ఉండలేక పోతున్నారు. వారికి ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి తీసుకెళ్తే వింతగా ప్రవర్తిస్తూ వైద్యానికి సహకరించడం లేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న పరిసర గ్రామాలకు మెదక్‌ పట్టణానికి చెందిన కొందరు యువకులు నిత్యం వెళ్లి కల్లు సేవిస్తుంటారు.

కంట్రోల్‌ చేయకుంటే ప్రమాదం

కల్తీ కల్లుకు అలవాటు పడిన వారిని మాన్పించకుంటే భవిష్యత్తులో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారిలో నరాలు దెబ్బతినడం, ఫిట్స్‌ రావటం, పక్షవాతం, బ్రెయిన్‌ స్టోక్‌ వచ్చే ఛాన్స్‌ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వారిని వెంటనే సైకియాట్రిస్ట్‌కు చూపించి, వారి సూచన మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు.

నెలనెలా మామూళ్లు!

ఇంత జరుగుతున్నా ఆబ్కారీ శాఖ చోద్యం చూస్తోంది. పేరుకే తనిఖీలు నిర్వహిస్తూ కల్లు దుకాణదారుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నర్సింహారెడ్డిని వివరణ కోరగా.. తాను ఇటీవలే జిల్లాకు బదిలీపై వచ్చానని, కల్తీ కల్లుపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మచ్చుకు కొన్ని..

గతేడాది పాపన్నపేటకు చెందిన ఓ విద్యార్థి ఎన్‌సీసీ క్యాంపునకు సంగారెడ్డి వెళ్లాడు. క్యాంపులో వింతగా ప్రవర్తించటంతో డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ విద్యార్థికి కల్లు తాగే అలవాటు ఉందని, మానేయడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నట్లు తేలింది.

ఇదే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కల్లు మానేయటంతో మానసికంగా దెబ్బతిని ఊరు వదిలి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు రాజస్థాన్‌లో మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement