అందరూ సహకరించాలి
● సర్వం సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ
మెదక్ కలెక్టరేట్: జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిపోయిన చిన్నారులకు 29, 30వ తేదీన సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్ ఇప్పటికే సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.
జిల్లాలో 75,496 మంది పిల్లలు
జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు మొత్తం 75,496 మంది ఉన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లావ్యాప్తంగా 457 బూత్‌లలో 872 మొబైల్ టీంలు, ట్రాన్సిస్ట్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బూత్‌లలో 1,828 మంది ఏఎన్‌ఎంలు, ఆశలు, డాక్టర్లు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.
నిర్లక్ష్యం వద్దు
పిల్లలు భయకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పి ల్లలకు పోలియో చుక్కలను వేయించాలి. పోలియో వ్యాధి రహిత దేశంగా తయారు చేసేందుకే ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.
పోలియో చుక్కలు వేయించుకోకుండా జిల్లాలో ఏ ఒక్క చిన్నారి తప్పిపోవద్దు. జిల్లాలో 125 హైరిస్క్ ఏరియాలు ఉండగా, అందులో 657 మంది పిల్లలను గుర్తించాం. వైద్యారోగ్య శాఖతో పాటు విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారుల సమన్వ యం చేశాం. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి.
– జ్ఞానేశ్వర్, డీఎంహెచ్‌ఓ


