డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
మెదక్‌జోన్: అర్హుల ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్‌ఓలకు ఏజెంట్ ఫాంలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓటరు వివరాల సేకరణ ప్రారంభం కావటంతో బీజేపీ నేతలు ఓటు చోరీ చేసే అవకాశం ఉందన్నారు. అర్హుల ఓటు తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఓలతో పాటు కార్యకర్తలపై ఉందన్నారు. ఏ ఒక్క ఓటు తొలగించినా, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిగా పోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ సిబ్బంది వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు సర్‌పై అవగాహన కల్పించి పాల్గొనేలా చూడాలన్నారు. ప్రజలు ఎన్యూమరేషన్ పత్రాలను నింపే సమయంలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో మెదక్, రామాయంపేట, హవేళిఘణాపూర్ మండలాలకు చెందిన బీఎల్‌ఓలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


