ఆత్మలకూ.. | - | Sakshi
Sakshi News home page

ఆత్మలకూ..

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026

ఆపన్నులకు అందించే చేయూత పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, వారికి ప్రతీనెలా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న (లైవ్‌ అథెంటికేషన్‌)తో అసలు విషయం బయటకు రాగా, ఇప్పటివరకు 1,843 మంది మృతుల పేరుపై పింఛన్లు వస్తునట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

– మెదక్‌జోన్‌

జిల్లాలో 10 రకాల చేయూత పింఛన్లు కలిపి మొత్తం 1,08,402 ఉన్నాయి. వీటిలో 59,841 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా వారి అకౌంట్లలో ప్రతి నెల డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే పోస్టాఫీస్‌ ద్వారా 48,561 మందికి పంపిణీ చేస్తున్నారు. వీరి కోసం ప్రతీ నెలా ప్రభుత్వం రూ. 24.82 కోట్లు అందజేస్తుంది. అయితే ఈనెల 1 నుంచి 30 వరకు ప్రతి పింఛన్‌దారుడి ఫేస్‌ రికగ్నేషన్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ పొందుతున్న 59,841 లబ్ధిదారుల్లో 1,843 మంది చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, ప్రతి నెల పింఛన్‌ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 8 ఏళ్లలో వీరికి సుమారు రూ.35.66 కోట్ల పైచిలుకు చెల్లించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల మరణాన్ని తెలుసుకొని పింఛన్‌ నిలిపి వేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ పరిధిలో పనిచేసే వార్డు అధికారులు చూసీ చూడనట్లు వదిలేయటంతోనే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబీకులతో లాలూచీ పడి వదిలేశారా..? అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

‘పేట’లోనే అత్యధికం

మృతుల చేయూత పింఛన్లు అందుకుంటున్న వారిలో మొదటి స్థానంలో పాపన్నపేట మండలం ఉంది. ఇక్కడ ఏకంగా 278 మందికి చనిపోయిన వారి పేర్లపై పింఛన్‌ అందజేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో వెల్దుర్తి మండలంలో 228, నిజాంపేటలో 220, హవేళిఘణాపూర్‌ 190, మెదక్‌ మున్సిపాలిటీ 146, టేక్మాల్‌ 143, శివ్వంపేట 122 మంది మృతుల పేరిట పింఛన్‌ పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని మండలాల్లో పదుల సంఖ్యలో మృతులకు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.

అర్హులకెప్పుడో..?

చేయూత పింఛన్ల కోసం అర్హులైన ఎంతో మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10,840 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,240 మంది ఆన్‌లైన్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌, ప్రజావాణి ద్వారా 9,600 మంది దరఖాస్తు చేసుకొని పింఛన్ల నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

జిల్లాలో 1,843 మంది మృతులకు పింఛన్లు

ఫేస్‌ రికగ్నేషన్‌తో వెలుగుచూసిన అక్రమాలు ఈ సంఖ్య పెరిగే అవకాశం రూ.35.66 కోట్లు పక్కదారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement